కాలువపై కదంతొక్కి.. | Sakshi
Sakshi News home page

కాలువపై కదంతొక్కి..

Published Tue, Jun 14 2016 8:06 AM

కాలువపై కదంతొక్కి.. - Sakshi

* ఎస్సారెస్పీ  తవ్వకాల వద్ద కొనసాగుతున్న ఆందోళన
* విద్యుత్ స్తంభం ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం
* పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు
* సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ

కొక్కిరేణి(తిరుమలాయపాలెం): ఎస్సారెస్పీ కాలువ తవ్వకాల వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుత ధర ప్రకారం తమకు ఎకరాకు రూ.10 లక్షలు చెల్లించాలని, పాత డిజైన్ ప్రకారం తవ్వకాలు చేపట్టాలని కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ కాలువ మార్కింగ్, తవ్వకాలు చేపడుతున్నారు. కొక్కిరేణి గ్రామానికి చెందిన దేవపంగు చిన్నా అనే రైతు ఆందోళనకు దిగాడు. తనకున్న మూడెకరాల మధ్యలో నుంచి కాలువ తవ్వడం వల్ల భూమి నష్టపోతున్నానని.. ప్రస్తుత ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. పోలీసులకు తన ఆవేదన చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి తీగలు పట్టుకునేందుకు యత్నించాడు.

అక్కడే ఉన్న సీఐ కిరణ్‌కుమార్ వెంటనే సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. న్యాయం చేస్తామని జేసీబీ సహాయంతో విద్యుత్ స్తంభం మీద నుంచి కిందకు దించారు. చిన్నాను పోలీసుస్టేషన్‌కు తరలించారు. రైతు చిన్నా కుమార్తె నామారపు సుజాత ఆందోళనకు దిగింది. కాలువ తవ్వకాలు చేపడుతున్న పొక్లెయిన్‌ను అడ్డుకుంది. మహిళా పోలీసులు బలవంతంగా ఆమెనూ స్టేషన్‌కు తరలించారు.

విషయం తెలుసుకున్న ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి ఘటనాస్థలికి వచ్చి రైతులతో మాట్లాడారు. ‘గతంలో భూసేకరణ జరిగింది కాబట్టి ఆ ధర ప్రకారమే డబ్బులు చెల్లిస్తాం. అభ్యంతరాలుంటే దీనిపై కోర్టును ఆశ్రయించుకోవచ్చు. ఆందోళన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.’ అని ఆర్డీఓ సూచించారు. తాము ఇంతవరకు డబ్బులు తీసుకోలేదని, ప్రస్తుత ధర ప్రకారం డబ్బులు చెల్లించాలని రైతులు ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. పాత డిజైన్‌ను మార్చి తమను ఇబ్బంది పెడుతున్నారని రైతు కర్నాటి హరిశ్చంద్రప్రసాద్ ఆర్డీఓ ఎదుట వాపోయాడు. రైతులు ఆందోళన చేయకుండా చట్టప్రకారం నడుచుకోవాలని ఆర్డీఓ సూచించారు. బందోబస్తు నడుమ కాలువ తవ్వకం పనులు పునఃప్రారంభించారు.

Advertisement
Advertisement