రుణం ఇవ్వకుంటే చస్తా..! | Sakshi
Sakshi News home page

రుణం ఇవ్వకుంటే చస్తా..!

Published Tue, Jul 19 2016 11:41 PM

రుణం ఇవ్వకుంటే చస్తా..! - Sakshi

  • క్రిమిసంహారక మందుతో బ్యాంకుకు వచ్చిన రైతు
  • బ్యాంకు అధికారుల తీరుపై ఆగ్రహం  
  • కెరమెరి  : ‘డాక్యుమెంట్లు తయారై నెలలు గడుస్తున్నయి. అయినా రుణాలు ఇవ్వడం లేదు. దళారులు, మధ్యవర్తులే సిఫారసు చేసిన వారికి రుణాలు ఇస్తున్నరు. ఇదెక్కడి న్యాయం? ప్రతి రోజు రుణం కోసం వస్తున్నా.. అయినా పట్టించుకోవడం లేదు.. రుణం ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చస్తా..’ అంటూ మండలంలోని మెటపిప్రి గ్రామానికి చెందిన రైతు సోము బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం కెరమెరిలోని తెలంగాణ దక్కన్‌ గ్రామీణ బ్యాంకులో ఈ సంఘటన కలకలం సృష్టించింది. సోముతోపాటు మండలంలోని బోరిలాల్‌గూడ, లక్మాపూర్, మెట్టిపిప్రి, మోడి, సుర్దాపూర్, చౌపన్‌గూడ, సాంగ్వి, కెలి(కే), కెలి(బి) తదితర గ్రామాల రైతులు బ్యాంకు అధికారులపై మండిపడ్డారు.
     
    ఖరీఫ్‌ ప్రారంభమై నెల పక్షం రోజులు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడంతో వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. ఇక్కడ ఎనిమిది మంది దళారులు బ్యాంకుల వారీతో లావాదేవీలు పెట్టుకున్నారని, బ్యాంకులో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఎలా బయటికి వెళ్తున్నాయి ? అని ప్రశ్నించారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా జరిగేది కాదని మండిపడ్డారు. రైతులను రోజుల తరబడి తిప్పిచ్చుకుంటూ దళారులు సిఫారసు చేసిన వారికి వెంటనే రుణం మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వీరి ఆందోళనకు కెరమెరి ఎంపీటీసీ ఇప్తేకార్‌ మద్దుతు పలికారు.
     
    దళారుల విషయం తమకు తెలియదని, నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తున్నామని, ఇంటర్‌నెట్‌ తదితర సమస్యల వల్ల కొంత జాప్యం జరుగుతోందని, ఇక నుంచి అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అసిస్టెంట్‌ మేనేజర్‌ హక్, షీల్డ్‌ అధికారి చారి హామీనిచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. 

Advertisement
Advertisement