రైతుల సంక్షేమమే ధ్యేయం | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే ధ్యేయం

Published Thu, Sep 29 2016 1:48 AM

రైతుల సంక్షేమమే ధ్యేయం - Sakshi

–డీసీసీబీ డైరెక్టర్‌ ముత్తవరపు పాండురంగారావు
నల్లగొండ టౌన్‌ : రైతుల సంక్షేమమే ధ్యేయమని, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో కొత్త రైతులకు రూ.20కోట్ల స్వల్ప కాలిక రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన బ్యాంక్‌ మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు పే రివిజన్‌ చెల్లించాలని నిర్ణయించామని, అన్ని రుణాలపై రుణ పథకానికి అనుగుణంగా వ్యక్తిగత లోన్‌ పరిమితి పెంచనున్నామన్నారు. ఇప్పటి వరకు దీర్ఘకాలిక రుణాలకు వాటా దారుడిగా వున్న రూ.10వేలను రూ.15వేలకు పెంచనున్నట్లు చెప్పారు.  బ్యాంకు ద్వారా రైతులకు వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలను ఇస్తున్నట్లు తెలిపారు.  రైతుల పిల్లల ఉన్నత విద్యకోసం కూడా రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు.  సహకార సంఘాల మౌలిక వసతుల కల్పనకు రూ.కోటి 3లక్షల 88 వేలను మంజూరు చేశామన్నారు. రుణమాఫీ ప్రకటించినందున జూన్‌ 2016 నాటికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు 91.55 శాతం వసూలు చేసినట్లు వివరించారు. రైతులకు వ్యక్తిగత బీమా కల్పించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల్లోని సభ్యులుగా ఉన్న రైతులు ఎవరైనా చనిపోతే వారి దహన సంస్కారాల కోసం రూ.10వేల చొప్పున  అందజేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లా పరిధిలోని అన్ని బ్రాంచీలు, ఎన్నిక చేయబడిన సహకార సంఘాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నామన్నారు.  అనంతరం ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కె.మదన్‌మోహన్, డైరెక్టర్లు ముదిరెడ్డి రమణారెడ్డి, హనుమయ్య, చిన్నపరెడ్డి నరేందర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, కోటేశ్వర్‌రావు, ఎస్‌. రవీందర్‌రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్, ముత్యపురావు, ఏర్పుల సుదర్శన్, వీరునాయక్, హర్య, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement