ప్రత్తిపాటిని నిలదీసిన రైతులు | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాటిని నిలదీసిన రైతులు

Published Sat, Jan 23 2016 12:00 PM

farmers slashes prattipati pullarao

* మాస్టర్‌ప్లాన్‌పై అవగాహనలో మంత్రి ఎదుటే రైతుల వాదులాట
* ప్రజల అభిప్రాయూల మేరకు మార్పులు: ప్రత్తిపాటి

 తుళ్లూరు రూరల్: గ్రామ కంఠాల వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రైతులు నిలదీశారు. గ్రామాలను కదిలించేది లేదని భూసమీకరణ సమయంలో చెప్పి.. ఇప్పుడు ఇళ్లు తొలగిస్తామనడమేమిటని మంత్రి, అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. మంత్రి ఎదుటే రైతులు ఇరు వర్గాలుగా విడిపోయి పరస్పరం వాదులాడుకున్నారు. గురువారం గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామస్తులు మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సును బహిష్కరించడంతో శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఇక్కడి సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను మంత్రి వద్ద ప్రస్తావించారు. గ్రామకంఠాల వ్యవహారంలో కొందరికి అన్యాయం జరిగిందన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో రాజధాని నిర్మాణానికి అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రైతులు రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు వాదులాడుతున్నారు. మంత్రి ముందున్న బల్లలను గట్టిగా చరుస్తూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు.

 ఇప్పుడు గుర్తొచ్చామా?
 జొన్నలగడ్డ రవి అనే రైతు మాట్లాడుతూ.. ‘మేం ఇప్పుడు గుర్తుకొచ్చామా..’ అంటూ మంత్రి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి కల్పించుకుని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే రహదారులు నిర్మిస్తామన్నారు. ప్రజల అభ్యంతరాల ప్రకారం మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. సమస్యలను సీఎం ముందుంచుతామన్నారు. వారంలో ఒక రోజు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే టి.శ్రావణకుమార్, కలెక్టర్‌తోపాటు తాను కూడా రాజధాని గ్రామాల్లో ఉండి సమస్యల పరిష్కారాని కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడ బజారు రాజకీయూలు చేయొద్దని వ్యాఖ్యానించారు. అనంతరం విలేకరుల సమావేశంలోనూ మంత్రి ఇదే రీతిలో మాట్లాడారు. సమావేశంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ల్యాండ్ డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 ఆందోళన వద్దు: కలెక్టర్
 గ్రామ కంఠాలను ఆనుకొని ఉన్న స్థలాలను మినహాయించకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. సీఆర్‌డీఏ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అభ్యంతరాలను ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి, అందరి ప్రజయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఆందోళన వద్దని సూచించారు.

Advertisement
Advertisement