Sakshi News home page

ధీమా ఇవ్వని ఫసల్‌బీమా

Published Wed, Apr 12 2017 11:51 PM

ధీమా ఇవ్వని ఫసల్‌బీమా - Sakshi

– దారుణంగా దెబ్బతిన్న పప్పుశనగ
- రూపాయి కూడా అందని పరిహారం
– ఎంతమంది ప్రీమియం చెల్లించారో చెప్పలేకపోతున్న అధికారులు


అనంతపురం అగ్రికల్చర్‌ : ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై).. దేశమంతా ఒకే ప్రీమియం ఒకటే బీమా పథకం.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016 మే నెలలో ప్రవేశపెట్టాయి. ఫసల్‌ బీమాతో రైతుల తలరాతలు మారిపోతాయని గొప్పలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలకు మంచి బీమా పథకం వచ్చిందని రైతులు కూడా చాలా ఆనందపడ్డారు. అందులోనూ అనంతపురం జిల్లా లాంటి కరువుపీడత రైతుల బతుకులకు భరోసా లభిస్తుందని ఆశించారు. అయితే ఫసల్‌బీమా కూడా పంటల బీమా, వాతావరణ బీమా పథకాల మాదిరిగానే రైతులను అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తోంది.

రబీలో ఫసల్‌ బీమా..
రబీకి సంబంధించి జిల్లాలో వరి, జొన్న, పప్పుశనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు ఫసల్‌ బీమా వర్తింపజేశారు. ఖరీఫ్‌లో అయితే రైతు వాటాగా 2 శాతం, రబీ పంటలకైతే 1.5 శాతం ప్రీమియం చెల్లించాలనే నిబంధన ఉంది. ఇందులో రబీకి సంబంధించి వరి హెక్టారుకు రూ.33,750, జొన్నకు రూ.20 వేలు, పప్పుశనగకు రూ.21,250, వేరుశనగకు రూ.45 వేలు, పొద్దుతిరుగుడుకు రూ.25 వేలు బీమా పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇవీ ప్రయోజనాలు..
వర్షాభావ పరిస్థితులతో పాటు అగ్నిప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, తుపాను, తీవ్ర తుఫాను, టోర్నడోలు, వరదలు, నీట మునగడం, భూమి దిగిపోవడం, అనావృష్టి, వాతావరణం బాగుండకపోవడం, పంటకు తెగుళ్లు, కీటకాలు ఆశించి నష్టం జరిగినా బీమా పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. కోతల తర్వాత పంట తడిచినా పరిహారం వర్తిస్తుందన్నారు. ఇవన్నీ కాకుండా పంటకు వేయడానికి భూములు దుక్కులు చేసుకుని, విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న తర్వాత వర్షాలు లేక విత్తనం వేయలేని పరిస్థితి ఏర్పడినా 25 శాతం వరకు పరిహారం వర్తింపజేయాలనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటితో పాటు బీమా చేసిన రైతు, ట్రాక్టర్, వ్యవసాయ సామగ్రిని కూడా బీమా పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గత బీమా పథకాలతో పోల్చితే ఫసల్‌ బీమాలో రైతులకు అనేక ప్రయోజనాలు కల్పించినట్లు ప్రచారం చేశారు. ప్రీమియం చెల్లించిన రైతుల ఖాతాల్లోకి నేరుగా పరిహారం జమ అవుతుందని చెప్పారు.

లోపభూయిష్టం..
ఫసల్‌ బీమా పథకం అమలులోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా పావలా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఇంత పరిహారం మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు కూడా వెలువడలేదు. పథకం గురించి చెప్పడానికి అటు జిల్లా మంత్రులు, ఇతర అధికార పార్టీ నేతలు కాని, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ కానీ నోరుమెదపడం లేదు. ఖరీఫ్‌లో నాలుగైదు పంటలకు ఈ పథకం అమలు చేయగా... వేరుశనగ పంటకు వర్తింపజేయకపోవడంతో పెద్దగా ఎవరూ ఈ పథకంలోకి రాలేదు. వేరుశనగ కాకుండా మిగతా పంటలు వేసిన రైతులు ప్రీమియం చెల్లించినట్లు చెబుతున్నా, అధికారుల దగ్గర వివరాలు అందుబాటులో లేవు.

ప్రధానంగా రబీలో పప్పుశనగకు వర్తింపజేయడంతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రీమియం చెల్లించినట్లు సమాచారం. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పప్పుశనగ పంట 80 శాతం మేర దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ప్రీమియం కట్టిన రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత మంది రైతులు, ఎన్ని హెక్టార్లకు, ఎంత మొత్తంలో ప్రీమియం చెల్లించారు...? అనే వివరాలు జిల్లాలో ఎవరి దగ్గరా లేకపోవడం విశేషం. దీనిపై లీడ్‌బ్యాంకు మేనేజర్‌ జయశంకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ప్రస్తుతం తన వద్ద వివరాలు లేవనీ, వివరాలు కోరుతూ బీమా కంపెనీ వారికి రెండురోజుల క్రితం మెయిల్‌ పంపామన్నారు. అక్కడి వివరాలు అందగానే ఎంత మంది ప్రీమియం చెల్లించారో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement