ఔటర్‌ రింగు రోడ్డు సర్వేతో భయం | Sakshi
Sakshi News home page

ఔటర్‌ రింగు రోడ్డు సర్వేతో భయం

Published Sat, Nov 26 2016 10:35 PM

ఔటర్‌ రింగు రోడ్డు సర్వేతో భయం - Sakshi

అమరావతి : మండల పరిధిలోని లింగాపురం, ధరణికోట గ్రామాల మీదుగా నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా నిర్మాణం చేసే ఔటర్‌ రింగురోడ్డు నిర్మాణంలో తమ భూములు ఎక్కడ పోతాయేమోనని రెండు గ్రామాల రైతులు భయాందోళన చెందుతున్నారు. సుమారు వారం రోజుల క్రితం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక సర్వే విభాగానికి సంబంధించిన సర్వే అధికారులు ధరణికోట–ముత్తాయపాలెం మధ్య కృష్ణా నది ఒడ్డు నుంచి లింగాపురం వరకు సర్వే కొలతలు వేసి కాంక్రీట్‌తో సర్వే రాళ్లు వేయడంతో ధరణికోట, ముత్తాయపాలెం, లింగాపురం గ్రామాలలోని రైతుల్లో అందోళన మొదలైంది. సుమారు 450 నుంచి 500 అడుగుల వెడల్పు గల అతిపెద్ద రోడ్డు నిర్మాణం జరుగుతుందని, ధరణికోట–ముత్తాయపాలెం మధ్య రింగ్‌ ఏర్పాటు చేయడానికి సుమారు 900 అడుగుల వెడల్పు స్థలం అవసరమవుతుందని వదంతులు రావడంతో కోటి నుంచి మూడు కోట్ల రూపాయల విలువ చేసే భూములను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వాల్సి వస్తుందేమోనన్న భయంతో ఉన్నారు. సర్వే రాళ్లు వేసి రోడ్డు పరిధిలో ఉన్న భూముల రైతులు తాతల కాలం నాటి నుంచి సమృద్ధిగా పంటలు పండే భూములను ఈ విధంగా రోడ్డు కోసం వదులుకోవాల్సివస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. ధరణికోట గ్రామాన్ని ఆనుకుని మరో ఐదు వందల ఎకరాలు పార్కుకోసం తీసుకుంటారని చెబుతుండడంతో ధరణికోట గ్రామ ప్రజలలో కూడా కోట్ల విలువ చేసే పొలాలు పోతాయేమోనని భయం మొదలైంది.

Advertisement
Advertisement