Sakshi News home page

రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు

Published Sun, Oct 25 2015 4:48 AM

రీయింబర్స్‌మెంట్‌పై మీనమేషాలు - Sakshi

♦ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త వైఖరి
♦ 58:42 నిష్పత్తిలో భరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా వెలువడని ఉత్తర్వులు
 
 సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇబ్బందులను పరిష్కరించే విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు, ఏపీలో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల ఫీజుల సమస్యలను తీర్చే విషయంలో ఈ ప్రభుత్వాలు ఇంకా పూర్తిస్థాయిలో చొరవ కనబరచడం లేదు. ఈ సమస్య ముందుకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రకటనతో సరిపుచ్చే ప్రయత్నమే తప్ప దీనిని పూర్తిస్థాయిలో పరిష్కరించే చర్యలేవీ రెండువైపులా తీసుకోవడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందినవారు తెలంగాణలో,  ఇక్కడి విద్యార్థులు కోస్తా, తదితర జిల్లాల్లోని ఇంటర్, ఇంజనీరింగ్, తదితర వృత్తివిద్యాకోర్సులను అభ్యసిస్తున్నారు.

ఏపీ జిల్లాలకు చెందిన విద్యార్థులు దాదాపు 20-25 వేల మంది తెలంగాణ జిల్లాల్లో చదువుకుంటున్నారని, తెలంగాణకు చెందినవారు ఏపీలో చదువుకుంటున్నవారు 5-10 వేల మంది విద్యార్థులు ఉంటారని ఒక అంచనా. ప్రస్తుతం చేరిన కోర్సు కంటె ముందు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే విద్యార్థుల స్థానికత అని, వారికే ఫీజు రీయింబర్స్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. రాష్ర్ట విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ 58:42  నిష్పత్తిలో ఈ విద్యార్థుల ఫీజులు, స్కాలర్‌షిప్‌లను చెల్లించాలని దాదాపు మూడునెలల క్రితమే రెండు ప్రభుత్వాలు సూత్ర ప్రాయంగా నిర్ణయించినా, దాని అమలుకు మాత్రం ముందుకు రావడం లేదు.

గతంలో ఉభయరాష్ట్ర సంక్షేమశాఖల ఉన్నతాధికారుల సమావేశానికి ఏపీ అధికారులు గైర్హాజరు కాగా, అప్పుడు నిర్ణయం వెలువడకుండా ఆగిపోయింది. మళ్లీ ఈ సమస్య ముందుకు వస్తున్న ప్రస్తుత సందర్భంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఈ విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాష్ర్ట ఉన్నతాధికారులు సైతం ఈ విద్యార్థుల సమస్యలను తీర్చడానికి ఇప్పుడు  ఉత్తర్వులిస్తాం, అప్పుడు ఉత్తర్వులిస్తామంటున్నారే తప్పించి, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను వేటిని ఇంకా విడుదల చేయలేదు.

తెలంగాణ విద్యార్థులు గత నాలుగేళ్ల కాలంలో ఏపీలో చదువుకుని ఉంటే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏ విధంగా చెల్లించాలనే దానిపైనా నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ అది ఆచరణ రూపాన్ని సంతరించుకోవడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ విద్యార్థులు తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందా లేదా, స్కాలర్‌షిప్‌లు వస్తాయా లేదా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఫీజును చెల్లించకపోతే నిర్ణీత ఫీజును విద్యార్థులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు భీష్మించడంతో ఈ సమస్య తీవ్రమవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement