యినాయకుని పెసాదం..బక్రీదు సేమ్యాల పాశం తినాల్సిందే..! | Sakshi
Sakshi News home page

యినాయకుని పెసాదం..బక్రీదు సేమ్యాల పాశం తినాల్సిందే..!

Published Mon, Sep 12 2016 9:34 PM

యినాయకుని పెసాదం..బక్రీదు సేమ్యాల పాశం తినాల్సిందే..!

కర్నూలు(కల్చరల్‌):
 ఏంవై మోదీనూ!... యియ్యాల శానా లేటుగ వస్తుండవ్‌. దినాం పొద్దు గాల్గ వస్తుంటివి గద. సూస్తుంటే ఆదాయం బాగా పెరిగినట్టుంది ఈ నడుమ. అందుకే మన్సులతోని మాట్లాడకోకుండ తలకాయ తిప్పుకోని పోతుండవబ్బా! అడిగాడు భద్రయ్య మామ.
    ఊ! బాగుంది మామా నూ సెప్పేది. దమ్మిడి ఆదాయం లేదు... పైస పురసత్తు లేదు అన్నట్లుంది నాకత. తెల్లారుజామున లేసి పూలబజారుకు పొయ్యి... పూలు కట్టీకట్టీ సేతులు నొస్తే సేతిలోనికి రొండొందలొచ్చేది శానా కటకట అయింది. యిప్పుడు గణేష్‌ పండుగ వచ్చింది. రోంత మేలు అనిపిస్తుంది. అందుకే వూరికి వచ్చెతలికి మొబ్బైతుంది మామా!... యాదో ఇదింత సీజన్‌ల నాలుగు రాల్లు మిగిలిచ్చుకోవల్లని ఆశ... చెప్పాడు మోదీన్‌.
    ఇంతకీ మీ అబ్బాకొడుకులను మెచ్చుకోవాలవై. మీ నాయన సత్తారు సాబు పూలదండ లేనిది మనూరోల్లు అమ్మవారి కాడికి పోతుండ్లా్య! దసర పండుగ నవరాత్రులు జరిగినన్నాల్లు మీ నాయినే అందరికీ దండలు కుట్టిస్తుండె. ఇప్పుడు ఆ పని నూ నేర్సుకున్నావు... చెప్పాడు భద్రయ్య మామ.
    అవు మామా!.. మీ తమ్ముడు మా నాయన శానా మంచి న్యాస్తులు గదా. మీ తమ్ముడు ఈరయ్య పీర్ల పండగ జరిగిన పది దినాలు పీర్ల సావిడి కాడే ఉంటుండె. మా నాయిన పీర్లకు పూలు కుట్టియ్యడం, ఈరయ్య మామ పేర్లకు అలంకారాలు సేయడం... బలే ఉండెలే మామ!... చెప్పాడు మోదీన్‌.
    అవు మామా!... మన ఊర్ల పీర్ల పండగ, కర్నూల్ల గణేష్‌ పండగ రొండూ ఒకటే సూడు మామా! సాయిబులు, హిందువులు అందురు కల్సి ఈ రొండు పండుగలు బలే సంబ్రంగ సేస్కుంటరు సూడు. మన ఊర్ల యినాయకునికి పూలదండలు కుట్టి యిచ్చినేది గూడా మోదీనే మామ! చెప్పాడు సిన్నరంగడు.
    అంత ఎందుకురా! కర్నూల్ల నలభై ఏండ్ల నాడు పీర్ల పండగ బమ్మాండంగ జరుగుతాండె. మేమల్ల కర్నూల్ల పీర్ల సావిళ్ల కాడికి పోయి అల్లాయి గుంతల కాడ సావుశేన్‌ తొక్కుతాంటిమి. దానిలెక్కనే ఇప్పుడు శానామంది సాయబుల పిల్లగాల్లు మట్టి యినాయకుల్ని సేసి యినాయకసవితి నాటినుండి నిమజ్జనం వరకు శానా సంబరాలు సేస్తున్నారు.. అదేరా మనకు కావాల్సింది. ఎవురి దేవుడైనా సెప్పేది ఒకటే. అందుకే పాతకాలం నాటి నుండి పల్లెల్లో టవున్లో గూడ అన్ని పండగలు అందురు కల్సిమెల్సి సేస్కుంటుండరు... చెప్పాడు భద్రయ్య మామ.
    మోదీనూ... ఈసారి గూడ నిరుడు లెక్కనే నిమజ్జనం బక్రీదు పండగ కలిసి వచ్చినాయి. ఒకపక్క సేమ్యాల పాశం ఘుమఘుమ, ఇంగోపక్క యినాయకుని పెసాదం ఘుమఘుమ. రొండు కలిపి కొట్రకావేటి రంగ... బలెవుంటదివై ఈసారి.. చెప్పాడు సిన్నరంగడు.
    వాయబ్బ నువ్వు ఇప్పటినుండే నోరూరిస్తుండవ్‌ గదరోయ్‌!... అట్లయితే ఈ పొద్దునుండే కడుపు  ఖాలీ పెట్టుకోవల్ల. బలె ఉంటది మామా ఆ పొద్దు. కర్నూల్ల గేరిలో ఇనాయకుడు లేస్తున్నాడని యింటింటికి పెసాదం పంచుతారు. సాయబులు బక్రీదు పండుగకు పక్కింటోల్లకు సేమ్యాల పాశం పంచుతరు. ఈల్లది వాల్లకు, వాల్లది ఈల్లకు దేవుడు ఏం కల్పినడు మామ!... చెప్పాడు మోదీన్‌.
    అంతేరా! మన పురాణాల్లో ఏముంటదో ఖురాన్‌లో అదే... బైబిల్‌లో అదే ఉంటది. రాముడు రహీము... ఇబ్రహీము అబ్రహాము.. పేర్లుల్లో ఎంత కలివిడితనం ఉందో సూడర్రి... ఇది తెల్సుకోక కొంతమంది నాదే గొప్ప నాదే గొప్ప అంటుంటరు. అందరి దేవుండ్లూ గొప్పనే. ఈడనే సూస్తే తెలుస్తుంది కదరా! మన వూర్లో యాప మానుకు గ్యారమీలు సేసి జెండా లెక్కిస్తరు. అదే యాప మానుకు మనూర్లో దస్ర నాడు, సంకురాత్రి నాడు కుంకుమ పూసి పూజలు సేస్తరు. అందరికీ యాపమాను నీడనే... తల్లిదండ్రి లెక్క ఆదుకుంటది... చెప్పాడు భద్రయ్య మామ!
        అంతెందుకు మామా! మా పెద్ద నాయనోల్ల యింట్ల పిలగాండ్లు బత్కడం లేదని దర్గకు పోయి దస్తగిరి సామికి మొక్కుకున్నరంట. అప్పుడు నుండి పుట్టిన పిల్లలు బత్కపట్టినరంట. ఇంగ సూస్కో లైనుగ వాల్లింట్లో పుట్టిన పిల్లలకు పెద్ద దరగయ్య,  సిన్న దర్గయ్య, పెద్ద దస్తగిరి, సిన్న దస్తగిరి, నడిపి దస్తగిరి... యిట్లా మొదులుపెట్టినారు. అంతే మామ! మనూర్లో అందురు ఇకింటి పిల్లల్లెక్కనే ఉంటరు. ఈ ఓట్లకొచ్చేతోల్లే సూడు వాల్ల నడ్మ ఈల్ల నడ్మ కొండి పెట్టి గెల్కుతరు. అయినా మన వూరోల్లు మాత్తరం ఏకంగానే ఉంటరు మామ!.. సెప్పాడు సిన్నరంగడు.
 

Advertisement
Advertisement