పడకేసిన అచ్చయ్యపాలెం! | Sakshi
Sakshi News home page

పడకేసిన అచ్చయ్యపాలెం!

Published Sat, Jul 23 2016 8:21 PM

అచ్చయ్యపాలెంలో జ్వరంతో బాధపడుతున్న బాలుడు

సీజనల్‌ జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు
పునరావాస గ్రామంపై అధికారుల నిర్లక్ష్యం
అచ్చయ్యపాలెం (సీతానగరం) :
‘పోలవరం’ పునరావాస గ్రామమైన అచ్చయ్యపాలెం సీజనల్‌ వ్యాధులతో పడకేసింది. ఏ ఇంట్లో చూసినా మంచానపడ్డవారే కనిపిస్తున్నారు. సుమారు 300 మంది ఉన్న ఈ గ్రామంలో కనీసం వైద్య సౌకర్యాలు కూడా కొరవడ్డాయి. గడప గడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించిన వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మికి ఆ గ్రామ ప్రజలు తమ గోడు వెళ్లగక్కారు. జ్వరం వచ్చిందంటే, ఆస్పత్రికి Ðð ళ్లడానికి సీతానగరం 15 కి.మీ., కోరుకొండ 16 కి.మీ. దూరంలో ఉన్నాయి.
వైద్యానికి దిక్కులేదు
నాగంపల్లి పంచాయతీలోని అచ్చయ్యపాలెం గ్రామం దూరంగా విసిరివేసినట్టుగా ఉంటుంది. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం గ్రామస్తులకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఏ చిన్నపాటి రోగానికి వైద్యం అందించే దిక్కులేదు. సుమారు 300 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 35 మందికి పైగా పిల్లలు, వృద్ధులు సహా జ్వరాలతో మంచాన పడ్డారు. వీరిది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. దాదాపు మూడు వారాలుగా వీరు మంచానపడి ఉన్నారు. కొంతమంది మోటార్‌ సైకిళ్లపై ఆస్పత్రులకు వెళుతున్నారు. ఆటోలు కానీ, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన అనిమిల్లి మంగ, అనిమిల్లి దీలీప్, అనిమిల్లి నవీన్, అనిమిల్లి మదులు జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే సంసాని వెంకయ్యమ్మ, పంది సురేష్, పంది రాంబాబు, పంది సూరమ్మ, పంది సూర్యచంద్రం, పీతా మునేష్‌ తదితరులు 25 మందికి పైగా జ్వరాలతో మంచాన పడ్డారు. ఈ గ్రామంలో టీబీతో బాధపడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. వీరికీ మందులు ఇచ్చే వారే కరువయ్యారు. వైద్యశాఖ అధికారులు అచ్చయ్యపాలెంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement