కొద్ది రోజులు చలికి విరామం | Sakshi
Sakshi News home page

కొద్ది రోజులు చలికి విరామం

Published Fri, Jan 1 2016 10:42 PM

few days leaves to cold

సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలపై కొద్ది రోజుల పాటు చలి జాలి చూపించనుంది. వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ పరిస్థితికి కారణం. ఇటీవలి వరకు ఉత్తర, వాయవ్య గాలులు వీయడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై చలి ప్రభావం అధికంగా కనిపించింది. నాలుగు రోజుల నుంచి గాలులు దిశ మారి ఇప్పుడు తూర్పు, ఆగ్నేయంగా వీస్తున్నాయి. ఇవి ఉత్తరం నుంచి వచ్చే శీతల గాలులను అడ్డుకుంటున్నాయి. దీంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ చలిని తగ్గిస్తున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3, గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-4, గరిష్ట ఉష్ణోగ్రతలు 3-6 డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. దీనివల్ల పగటి పూట వెచ్చదనం పెరుగుతూ, రాత్రి వేళ చలి ప్రభావం కనిపించడం లేదు. ఉత్తర భారతదేశం మీదుగా వెస్టర్న్ డిస్టర్బెన్స్ (పశ్చిమ ఆటంకాలు) వెళ్తుండడమే ఈ పరిస్థితికి కారణమని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకష్ణ శుక్రవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. కొద్ది రోజులపాటు ఈ వాతావరణం ఉంటుందని, అనంతరం మళ్లీ చలి మొదలవుతుందని చెప్పారు. గడచిన 24 గంటల్లో విశాఖ జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో అత్యల్పంగా 4, తెలంగాణలోని ఆదిలాబాద్ లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గడచిన 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణమే నెలకొంది.

Advertisement
Advertisement