సైనికుల్లా ఉద్యమిద్దాం | Sakshi
Sakshi News home page

సైనికుల్లా ఉద్యమిద్దాం

Published Sun, Nov 6 2016 10:45 PM

సైనికుల్లా ఉద్యమిద్దాం

- ఎస్టీ రిజర్వేషన్‌ సాధనపై వాల్మీకి నేతల పిలుపు
- గుడేకల్‌ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ
 
ఎమ్మిగనూరురూరల్:  ఎస్టీ రిజర్వేషన్‌ సాధనకు వాల్మీకులంతా సైనికుల్లా పోరాడాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు.  మండల పరిధిలోని గుడేకల్‌ గ్రామంలో ఆదివారం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహవిష్కరణ  కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్‌పై అసెంబ్లీలో గవర్నర్‌తో ప్రసంగం చేయించిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసెత్తడం లేదన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేస్తామని ప్రకటించారు. 
 ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. 
వాల్మీకులకు ఎస్టీ రిజర్వేషన్‌ సాధన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్‌చంద్రబో‹స్‌ అన్నారు. రిజర్వేషన్‌కోసం కుప్పం నుంచి 11వందల కిలో మీటర్లు పాదయాత్ర ద్వారా హైదరాబాద్‌ వెళ్లి సీఎం చంద్రబాబుకు విన్నవించామన్నారు. డిశంబర్‌ 14న కర్నూలు శ్రీకృష్ణదేవరాయుల సర్కిల్‌లో 99 గంటల నిరవధిక నిరాహర దీక్ష తలపెట్టినట్లు తెలిపారు. దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఎవరి పార్టీలో వారు ఉండండి రిజర్వేషన్‌కు మాత్రం పార్టీలకతీతంగా పోరాడండి అంటూ నాయకులకు పిలుపునిచ్చారు. ఎస్టీ రిజర్వేషన్‌ సాధనకు వాల్మీకులంతా చేతులు కలపాలని వీఆర్‌పీఎస్‌ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ కోరారు. రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు రాంభీంనాయుడు, గూడూరు గిడ్డయ్య, రవి, డాక్టర్‌ మధుసూదన్, మాధవరం రామిరెడ్డి, కౌతాళం సురేష్, తాలుకా అధ్యక్షులు వీజీఆర్‌ కొండయ్య, జగ్గాపురం ఈరన్న, గిడ్డయ్య, రఘు, లైన్‌మెన్‌ రాణి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement