Sakshi News home page

కొట్టుకున్నారు..తిట్టుకున్నారు

Published Tue, Jul 26 2016 11:19 PM

fight..bad talking

– పుత్తూరు టీడీపీలో వర్గపోరు బహిర్గతం  
– ఆ ఇద్దరూ పెద్దాయన అనుచరులే
– పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ 
పుత్తూరు : పుత్తూరు మండల టీడీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ పోరు బహిర్గతమైంది. ఆ పార్టీ మండల బాధ్యుడు, మండల పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుడు బాహాబాహీకి దిగారు. ఈ సంఘటనకు తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణ వేదికైంది. స్ధానికుల కథనం మేరకు సోమవారం సాయంత్రం వర్షం కురుస్తున్నప్పుడు ఆ ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. బూతులు మాట్లాకున్నారు. ఒకరి గురించి ఒకరు లోపాలను ఎత్తి చూపారు. బహిరంగంగానే బిగ్గరగా కేకలు వేసుకుంటూ అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. స్థానికులు కలుగుజేసుకుని వారికి సర్దిచెప్పారు. అయితే ఈ ఇద్దరూ ఆ పార్టీ నియోజకవర్గ పెద్దాయన అనుచరులే. వారిలో ఒకరు ఎంపీపీ వర్గం, మరొకరు మండల ఉపాధ్యక్షుని వర్గానికి చెందినవారు. పార్టీ మండల బాధ్యుడు తహశీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ విభాగంలోకి రాత్రి సమయాల్లో వెళ్లి ఆపరేటర్‌ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు సేకరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై మండల పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుడు సోమవారం సాయంత్రం తహశీల్దార్‌ను సంప్రదించి ప్రశ్నించారు. ఆ సమాచారం తెలుసుకున్న పార్టీ మండల బాధ్యుడు ఆగ్రహంతో తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న కో–ఆప్షన్‌ సభ్యుడిపై తీవ్ర పదజాలంతో దాడికి దిగారు. పరస్పరం కొట్టుకున్నారు. దీనిపై మంగళవారం పోలీస్‌ష్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. అందరూ చూస్తుండగానే బాహాబాహీకి తలపడిన వారిపై కేసులు నమోదు కాలేదు. పై పెచ్చు విచారణ పేరుతో పంచాయితీ నిర్వహించిన అంశం చర్చనీయాంశంగా మారింది. 
 
ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.. 
 పెద్దాయన అనుచరులిద్దరూ కొట్టుకున్నారనే విషయంపై తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ హనుమంతప్ప తెలిపారు. పంచాయితీ చేస్తున్నారనే విషయంపై అడిగితే అలాంటిదేమీ లేదని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement