ఉద్యమంలా దోమలపై దండయాత్ర | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా దోమలపై దండయాత్ర

Published Sat, Oct 1 2016 1:38 AM

ఉద్యమంలా దోమలపై దండయాత్ర - Sakshi

–నేడు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు
–జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ ఆదేశం
కర్నూలు(హాస్పిటల్‌): దోమలపై దండయాత్ర– పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సి. హరికిరణ్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో  జిల్లా కేంద్రం నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలను శనివారం మధ్యాహ్నం నగరపాలక సంస్థలు, గ్రామపంచాయతీలు, పురపాలక సంస్థల పరిధిలో తప్పక నిర్వహించాలన్నారు. ముఖ్యకూడళ్లలో ర్యాలీలు నిర్వహించి, పేదలుండే కాలనీల్లో పెద్ద ఎత్తున ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా వనం–మనం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం, వాటి సంరక్షణ, ట్రీగార్డుల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థల నుంచి విద్యార్థులను బందాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 55వేల బందాలు ఉండగా, ఒక్కో బందానికి 10 ఇళ్లను కేటాయించి, వారి ద్వారా సదరు కుటుంబాల్లో వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అందుకు అవసరమైన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లిప్‌ క్యాలెండర్లు వైద్య ఆరోగ్యశాఖ సమకూరుస్తుందన్నారు.   స్వయం సహాయ సంఘాల మహిళలను ఇందులో భాగస్వామ్యులను చేయాలన్నారు. ప్రతి అధికారి తమ కార్యాలయ పరిసరాల్లో కూడా పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి, సీపీవో ఆనందనాయక్, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరిబాబు, డీపీవో ఆందన్, నగర పాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రబాబు, డీఆర్‌డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement