మండలి పోరు రసవత్తరం | Sakshi
Sakshi News home page

మండలి పోరు రసవత్తరం

Published Mon, Mar 6 2017 10:19 PM

మండలి పోరు రసవత్తరం - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో జోరందుకున్న  పీడీఎఫ్‌
దూసుకెళుతున్న యండపల్లి, విఠపు
టీడీపీ అభ్యర్థుల్లో కలవరపాటు
ప్రచారానికి రెండు రోజులే గడువు


రాయలసీమ తూర్పు విభాగం చిత్తూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ (ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌)కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలకడంతో మరో మారు బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు కొత్త ఉత్సాహంతో దూసుకెళుతుంటే.. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ            ఒడ్డుతోంది.

చిత్తూరు (కలెక్టరేట్‌): ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం ఓవైపు, అధికారంలో ఉన్నా పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే భయం మరోవైపు పీడిస్తోంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా విద్యావంతులు మాత్రమే ఓటువేసే ఎమ్మెల్సీ ఎన్నికల  ప్రచారానికి 7వ తేదీ సాయంత్రానికి తెరపడనుంది. దీంతో ఇటు సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు, అటు అధికార పార్టీ అభ్యర్థులు గెలుపుకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 9వ తేదీ జరుగనున్న శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు  ఉన్నా రు. అందులో పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అయితే బరిలో అధిక సంఖ్య లో అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా   పీడీఎఫ్‌కు చెందిన సిట్టింగ్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, అధికార పార్టీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి,   ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

వైఎస్సార్‌సీపీ మద్దతుతో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న పీడీఎఫ్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు పలికింది. ఇప్పటికే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా రెండు దఫాలు వరుసగా కొనసాగుతున్న విఠపు బాలసుబ్రమణ్యం మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ప్రస్తుతం  పట్టభద్రుల ఎమ్మెల్సీగా  కొనసాగుతున్న యండపల్లి శ్రీనివాసులు రెండో దఫా మరోమారు  ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటు ఉపాధ్యాయులకు, అటు పట్టభద్రులకు సుపరిచితులే. వారిరువురికీ సమస్యలపట్ల పోరాట యోధులుగా, సౌమ్యులుగా మంచి పేరుంది. నియోజకవర్గ పరిధిలోని మూడు జిల్లాల్లోనూ వీరిద్దరికి క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే అనుచర గణంతోపాటు, మంచి పరిచయాలూ ఉన్నాయి. కాబట్టే వీరు వరుస విజయాలతో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు రెండు నెలలకు ముందు నుంచే పీడీఎఫ్‌ తిరిగి వీరిని అభ్యర్థులుగా ప్రకటించడంతో అప్పటి నుంచే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.  దీనికితోడు  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా పీడీఎఫ్‌కు మద్దతు పలకడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది.

టీడీపీలో కలవరపాటు
గడచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపజయాలను చవిచూసిన అధికార టీడీపీ పార్టీ మరో మారు ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మంత్రి నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డిని  పట్టభద్రుల స్థానానికి బరిలోకి దింపారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో అనుచరగణం ఉన్నా, పట్టభద్రులకు  నిరుద్యోగ భృతి అందించడం,  ఉద్యోగాల కల్పన  లాంటి  హామీలను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారు. దీంతో అధికార పార్టీ వర్గాల్లో ఓటమి భయం వెంటాడుతోంది.   ఉపాధ్యాయుల స్థానానికి చిత్తూరు జిల్లాకు చెందిన వాసుదేవనాయుడును బరిలోకి  దింపింది. అయితే ఆది నుంచి ఈ స్థానానికి టికెట్‌ ఆశించిన తిరుపతికి చెందిన ప్రముఖ విద్యాసంస్థల చైర్మన్‌ చదలవాడ సుచరితకు ఆఖరుకు ఆశ ఫలించక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతవరకు మహిళకు చోటు కల్పించిన దాఖలాలు లేకపోగా, మొదటగా మహిళా అభ్యర్థి అధికార పార్టీకి అసమ్మతి వర్గంగా బరిలో ఉండడం కలవరపెడుతోంది. అదేగాక ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమవడం కూడా ఒక కారణంగా నిలిచింది.

అయితే పీడీఎఫ్‌కు చెందిన ఉపాధ్యాయుల స్థానం అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు గత ఎన్నికల్లో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమయిన యూటీఎఫ్‌ మద్దతుతోనే రెండు దఫాలు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో యూటీఎఫ్‌కు మరో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ కూడా మద్దతు పలికి తోడవడం, దీనికితోడు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడంతో విఠపు బాలసుబ్రమణ్యం విజయానికి మరింత బలాన్ని ఇచ్చింది. పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రామచంద్రారెడ్డి కూడా జాతీయ స్థాయి పెద్ద పార్టీ పేరుతో ఒకింత శాయశక్తులా కృషి చేస్తున్నారు. అదేస్థాయిలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల స్థానానికి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement