ఆరని మంటలు | Sakshi
Sakshi News home page

ఆరని మంటలు

Published Sun, Oct 23 2016 12:09 AM

ఆరని మంటలు - Sakshi

  • వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద పేలుడు సంఘటనకు రెండేళ్లు
  • బాధితులను పట్టించుకోని ప్రభుత్వం 
  • దయనీయ స్థితిలో కుటుంబాలు
  • అందరి కళ్లలో వెలుగు పూలు పూయించే దీపావళి ఇంక రెండు రోజులే.. పిల్లల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం.. పండక్కి నాలుగు డబ్బులు చేసుకుందామనుకున్న వారి జీవితాల్లో తీవ్ర ఆవేదన మిగిల్చింది ఆరోజు.  ఆ దుస్సంఘటనను తలుచుకుంటే నేటికీ మనసు కలతబారుతుంది. అదే వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రం వద్ద సంభవించిన పెను విస్ఫోటనం. 18 మందిని బలిగొన్న ఆదుర్ఘటనకు రెండేళ్లు నిండాయి. తమవారిని కోల్పోయిన ఆ కుటుంబాల్లో నేటికీ తీరని ఆవేదనే. వారిని కదిలిస్తే వారిగుండెల్లోని ఆరనిమంటలు భగ్గున పైకెగుస్తున్నాయి.
    – పిఠాపురం   
     
    పేలుడు జరిగిన దుర్దినం
    అందరూ దీపావళి పండుగ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నారు. పిల్లలు తాము కాల్చుకొనే బాణసంచా గురించి ఊసులు చెప్పుకుంటున్నారు.  2014 అక్టోబర్‌ 20. మరో రెండు రోజుల్లో దీపావళి. గ్రామాల్లో పండుగ వాతావరణం. వ్యవసాయ కూలిపనులు లేని రోజుల్లో నాలుగు డబ్బులు ఎక్కువ ఇస్తానని ఫైర్‌వర్క్స్‌ ఫ్యాక్టరీ యజమాని చెప్పడంతో   21 మంది పనిలోకి వచ్చారు. ఆరోజుతో మందుగుండు సామగ్రి తయారీ పూర్తవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు పని పూర్తి చేసి అందరూ ఇంటికి వెళ్లిపోవాలని గబగబా పనులు చేసుకుంటున్నారు. పనిపూర్తయితే డబ్బుతో పాటు మందుగుండు సామగ్రి కూడా ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటలైంది. అప్పటికే మందుగుండు సామగ్రి కొనుగోలు చేయడానికి కొనుగోలు దారులు వస్తున్నారు. వారికి సాయంత్ర 5 దాటాకా రండని మందుగుండు సామగ్రి తయారీ  కేంద్ర యజమాని చెబుతున్నాడు. అమ్మకాలు ప్రారంభించడానికి యజమాని అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆరుబయట టెంట్‌ వేసి మందుగుండు సామాగ్రిని బయటకు తరలించడం ప్రారంభించారు. సరిగ్గా 3. 30 గంటలకు మందుగుండు తయారీ కేంద్రంలో పేలుడు.  వేయి బాంబులు ఒక్క సారిగా పేలిన శబ్దాలు. పెను మంటలు. స్థానికుల హృదయాలను దహించేసిన ఆమంటలు 18 మందిని పొట్టన పెట్టుకున్నాయి.  30 కుటుంబాల్లో చీకట్లు కమ్మాయి.
     
    బాణసంచా తెస్తామన్నారు.. కాలి బూడిదయ్యారు
    కూలి డబ్బులు తెస్తా. నీకు మందుగుండు సామాన్లు తీసుకొస్తా అంటూ కుటుంబ సభ్యులకు, పిల్లలకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా కాటికి వెళ్లిపోయారు. కాల్చుకోడానికి బాణాసంచా తెస్తానన్న వారుకడసారి చూపుకు కూడా నోచుకోకుండా కాలిబూడిదై పోయారు.  ఏశవం ఎవరిదో తెలియని హృదయవిదారకమైన పరిస్థిలో అశువులు బాసిన వారి మృతదేహాలను నేరుగా శ్మశానవాటికకు తరలించారు. వారి బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేదు.  ఏకంగా 18 మంది చూడడానికి ఆకారం లేదు . గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు.  తెల్లగుడ్డలలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్లో ఆమూడు గ్రామాల వారు గొల్లుమన్నారు. 
     
    పంటపొలాల్లో నెత్తురు ముద్దలు
    పేలుడు ధాటికి చెల్లా చెదురుగా అక్కడ పని చేస్తున్నవారు ఎగిరి పడడంతో పచ్చనిపంటపొలాల్లో  నెత్తురు ముద్దలతో వాకతిప్ప గ్రామం మరుభూమిగా మారిపోయింది.  సంఘటనాస్థలం నుంచి సుమారు  500 మీటర్ల వ్యాసార్ధంలో పొలాలు, కొబ్బరి తోటలు నెత్తుటి మరకలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా క్షతగాత్రుల శరీరభాగాలు కనిపిస్తూ ఆప్రాంతం భయానకంగా మారింది. విస్పోటనం  ధాటికి సంఘటనాస్థలం పక్కనే ఉన్న పంటపొలం సుమారు అరెకరం వ్యాసార్థ్దంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. కొబ్బరి, మామిడి టేకు చెట్లు నిలువునా దహించుకుపోయాయి. చెట్ల కొమ్మలకు ఎముకలు వేలాడాయి.  సుమారు 500 మీటర్ల దూరంలో పూర్తిగా కాలిపోయి శరీరభాగాలు, చెల్లాచెదురైన మృతదేహాలు దొరికాయి.
     
    కొబ్బరిచెట్లే కాపాడాయా..?
    సంఘటనాస్థలాన్ని పరిశీలించిన నిపుణులు సుమారు 1000 కేజీల మందుగుండుతో పేలిన మందుపాతర అంత విధ్వంసం సృష్టించిందని తేల్చారు. సంఘటనాస్థలం చుట్టు ఉన్న కొబ్బరిచెట్లు పేలుడుకు ఎగిసిపడిన శి«ధిలాలను, మంటలను దూరంగా వెళ్లకుండా నిరోధించగలిగాయన్నారు. అవి కొబ్బరిచెట్లకు తగిలి అక్కడికక్కడే పడిపోవడంతో ప్రమాదం తప్పిందని అగ్నిమాపక అధికారులు అన్నారు. లేకుంటే ఆ అగ్నికీలలు వాకతిప్ప గ్రామాన్ని బూడిద కుప్పగా మార్చేవన్నారు.  
     
    మూగజీవాలనూ వదలని విస్ఫోటనం
    ఈ పేలుడు ధాటికి మూగజీవాలు సైతం బలైపోయాయి. ఆప్రాంతలో ఉన్న శునకాలు తీవ్రగాయాల పాలయ్యాయి.  మంటల ధాటికి పక్కనే పొలాల్లో కట్టిఉన్న కొన్ని పశువులు విలవిలలాడుతుంటే స్థానికులు వాటికట్లు విడదీశారు. దాంతో అవి పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నాయి.
     
    అందని చేయూత
    బాదిత కుటుంబాల పిల్లలకు ఉచిత కార్పొరేట్‌విద్య, హాస్టల్‌ వసతి, ఇళ్లు, ప్రభుత్వ ప«థకాల ద్వారా ఆర్ధిక సహాయం, ఇంటికో ఉద్యోగం, అరెకరం భూమి ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామంటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో మృతదేహాలను పరిశీలించి  ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు అప్పట్లో అందజేసిన ఆర్ధిక సహాయం తప్ప మిగిలినవి ఏమీ అందలేదని బాధితులు వాపోతున్నారు. 
     
    ఆగిన భూపంపిణీ
    ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి అరెకరం భూమి ఇస్తామని ప్రభుత్వం ఇచ్ని హామీ మేరకు అధికారులు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సమీపంలో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. బాదితులకు పంపిణీ చేసేందుకు పట్టాలు సిద్దం చేసారు. కానీ ఆభూమి సెజ్‌కు సమీపంలో ఉండడంతో దాని విలువ రూ, కోట్లకు చేరుతుందన్న  ముందస్తుసమాచారంతో ముఖ్యనేత ఆభూమిపై కన్నువేయడంతో పట్టాల పంపిణీ ఏడాదిగా ఆగిపోయింది. బాదిత కుటుంబాలు ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు.
     
    జగన్‌ రాకతో పెరిగిన నష్టపరిహారం
    ఒక్కో మృతుని  కుటుంబానికి రూ, 2లక్షల పరిహారం అందజేస్తామని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. అయితే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహæన్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ. 50 వేల చొప్పున వెనువెంటనే పరిహారం అందించారు. రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దాంతో దిగి వచ్చిన ప్రభుత్వం నష్టపరిహారాన్ని రూ, 3లక్షలకు పెంచి పంపిణీ చేసింది. 
     
    దయనీయ స్థితిలో బాధిత కుటుంబాలు 
    తండ్రిని కోల్పోయిన పిల్లలు, భర్తను కోల్పోయిన భార్య, పిల్లలను కోల్పోయిన తల్లి , చెల్లిని కోల్పోయిన అన్న.. ఇలా తమ రక్తసంబంధీకులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో గత రెండేళ్ల నుంచి ఆ  కుటుంబాలు దయనీయ స్థితిలో ఉన్నాయి . ప్రమాదంలో దమ్ము గుర్రయ్య మృతి చెందగా అతని భార్య మంగాదేవి, పిల్లలు విమలాదేవి, ప్రమీల అనాథలుగా మిగిలారు. బాధితులను ఆదుకుంటామని, వారి పిల్లలను చదివిస్తామన్న నాయకులు 
    కానరాకుండా పోవడంతో అప్పులు చేసి ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని మంగాదేవి కన్నీటిపర్యంతమవుతోంది.
     
    ఆ ముందురోజే జరిగి ఉంటే..
    ఆ ముందు రోజు వరకూ వందల సంఖ్యలోవిద్యార్థులు మతాబులను తయారు చేశారు. ఆరోజు సోమవారం పాఠశాల ఉండడంతో వారు పనిలోకి రాలేదని స్థానికులు తెలిపారు.  లేకుంటే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండేదన్నారు.
     
    కాగితాలకే పరిమితమైన విచారణ
    సంఘటనపై కాకినాడ ఆర్డీఓ నిర్వహించిన మేజిస్టీరియల్‌ విచారణ కాగితాలకే పరిమితమైంది. అసలు ఆసంఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనేది మిస్టరీగానే మిగిలింది. 18 మందిని పొట్టన పెట్టుకున్న సంఘటనపై విచారణ తీరు సైతం తీవ్రవిమర్శలకు దారితీసింది. రెండేళ్లయినా ఆవిచారణ ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది.
     
    జగన్‌తప్ప ఎవరూ  పట్టించుకోలేదు
    ఆప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాను. అప్పట్లో ఎన్నో ఇస్తామన్నారు కానీ ఏదీ పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోడం మానేశారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహ¯ŒSరెడ్డి వచ్చి స్వయంగా పరామర్శించి రూ. 20 వేలు ఆర్థిక సహాయం చేశారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు.  మృతుల కుటుంబాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవడం ఎంత వరకు సమంజసం? గాయాలపాలై నెలల తరబడి మంచంపై ఉండాల్సి వచ్చింది. కుటుంబ పోషణ భారమైంది. ఎవరూ పట్టించుకొనకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకున్నా.
    – కుక్కల శ్రీనివాసరావు, ప్రమాదంలో గాయపడిన బాధితుడు, వాకతిప్ప
     
    దళితులం కాబట్టే వదిలేశారు
    ప్రమాదంలో నాతల్లి మృతి చెందింది. కళ్లముందే మావాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీS చెప్పడం లేదు. విచారణ కూడా అంతా లోపభూయిష్టంగా జరిగింది. మాకు ఇస్తామన్న ఏఒక్కటీ సరిగ్గా ఇవ్వలేదు. భూమి ఇస్తామని చెప్పారు. ఏడాది పాటు ఆఊసు ఎత్తలేదు. చివరకు ఆందోళనకు దిగగా భూమికి పట్టాలు ఇచ్చారు. అవి కూడా కొన్ని నెలల పాటు పంపిణీ చేయలేదు. పట్టాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా భూమి అప్పగించ లేదు. మాకు ఇస్తున్నామని చెబుతున్న భూమి ఉప్పుటేరు కావడంతో గోతుల మయంగా ఉంది. దాన్ని ఎత్తు చేసి ఇస్తామన్నారు. కానీ నెలలు గడుస్తున్నా ఎటువంటి పనులు చేయలేదు. భూమి అప్పగించలేదు.           
        – ద్రాక్షారపు నాగేశ్వరరావు, బాధితుడు, వాకతిప్ప
     

Advertisement
Advertisement