Sakshi News home page

అగ్ని ప్రమాదంలో ఏడిళ్లు దగ్ధం

Published Sat, Dec 10 2016 11:39 PM

అగ్ని ప్రమాదంలో ఏడిళ్లు దగ్ధం - Sakshi

  • నిరాశ్రయులైన  11 కుటుంబాలు
  • రూ 9.5 లక్షల ఆస్తి నష్టం
  • వానపల్లి (కొత్తపేట) :
    కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో శనివారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో ఐదిళ్లు పూర్తిగా, రెండు పాక్షికంగా దగ్ధమై 11 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. దాదాపు అన్ని కుటుంబాల వారు కట్టు బట్టలతో మిగిలారు. సుమారు రూ.9.5 లక్షలు ఆస్తినష్టం సంభవించింది. బండారు రాజాగారి వీధిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల హఠాత్తుగా ఒక ఇంట్లో మంటలు చెలరేగి చుట్టుపక్కల ఇళ్లను చుట్టుముట్టాయి. దానితో పెట్టా పళ్ళంరాజు, బండారు సత్తిరాజు, బండారు అన్నవరం, బండారు పళ్ళంరాజు, బండారు వెంకటేశ్వరరావు, నూకల వెంకటేశ్వరరావు, నూకల పళ్లంరాజు, నూకల నాగేశ్వరరావు,బండారు లక్ష్మణరావు, నూకల ధనరాజు, బండారు మునియ్యల కుటంబాలకు చెందిన పెంకుటిళ్లు, తాటాకు ఇళ్ళు దగ్ధం కాగా ఇంటి సామగ్రి, ఆధార్, రేష¯ŒS కార్డులు, 3 గ్యాస్‌ సిలిండర్లు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే కొత్తపేట అగ్నిమాపక అధికారి సీహెచ్‌ నాగేశ్వరరావు సిబ్బంది, అగ్నిమాపకవాహనంతో వెళ్లి మంటలను అదుపుచేశారు.  సర్పంచ్‌ పల్లి భీమారావు, సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కార్యదర్శి బండారు సత్తిరాజు (రాజా), మాజీ సర్పంచ్‌ కామిశెట్టి అమ్మన్న, తహశీల్దార్‌ ఎ¯ŒS.శ్రీధర్,ఎస్సై డి.విజయకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు.
    నిలిచిపోయిన నిశ్చితార్ధం..
    బండారు వెంకటేశ్వరరావు కుమార్తె వివాహానికి ఈ నెల 21 న ముహూర్తం నిర్ణయించారు.ఆ మేరకు శనివారం నిశ్చితార్ధం జరగవలసివుంది. మూడు గంటల్లో ఆ కార్యక్రమం జరుగుతుందనగా ఈ ప్రమాదం సంభవించడంతో వారు కట్టుబట్టలతో మిగిలారు. వారి ఇంట్లో కొంత బంగారం, నగదు, కొత్త బట్టలు మంటల్లో కాలిపోయాయి. నూకల వెంకటేశ్వరరావు అనే అరటి వ్యాపారి తాను వ్యాపారం చేయగా వచ్చిన సొమ్ము అగ్నికి ఆహుతి అయింది. అలాగే ఇతర బాధితుల ఇళ్లల్లో కూడా కొంత నగదు, బట్టలు,సామగ్రి దగ్ధమయ్యాయి.
    ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ.. 
    అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన వానపల్లి తరలివచ్చారు. బాధితులను పరామర్శించి ఓదార్చారు. ప్రమాదంపై అధికారులను ఆరా తీసి బాధితులకు 10 కేజీలు చొప్పున బియ్యం పంపిణీ చేశారు. తక్షణ పరిహారం విషయంలో లేనిపోని సాకులు చెప్పకుండా వెంటనే రూ 5 వేలు చొప్పున అందచేయాలని తహశీల్దార్‌ శ్రీధర్‌ను ఆదేశించారు.అదనంగా కలెక్టర్‌ సహాయం రూ.3 వేలు చొప్పున మంజూ రుకు కృషి చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు వెంటనే అగ్నిప్రమాదం సర్టిఫికెట్లు ఇవ్వాలని అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావును జగ్గిరెడ్డి ఆదేశించారు. వాటి ఆధారంగా పక్కా గృహాల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగ్గిరెడ్డి వెంట రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు తదితరులు వున్నారు.
     

Advertisement
Advertisement