‘రూ. వెయ్యి కోట్ల జీఎంవీపై దృష్టి’ | Sakshi
Sakshi News home page

‘రూ. వెయ్యి కోట్ల జీఎంవీపై దృష్టి’

Published Wed, Aug 10 2016 6:46 PM

' focus on  Rs . thousand crore GMC'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ పోర్టల్ ద్వారా రూ. 1,000 కోట్ల మేర జీఎంవీని సాధించాలని నిర్దేశించుకున్నట్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించే క్యాష్‌కరోడాట్‌కామ్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ వెల్లడించారు. మూడేళ్ల క్రితం పోర్టల్ ప్రారంభించినప్పట్నుంచీ జీఎంవీ పరంగా (ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా జరిగే లావాదేవీల స్థూల విలువ) ఏటా దాదాపు 300 శాతం మేర వృద్ధి సాధిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. క్యాష్‌బాక్, కూపన్‌ల విభాగంలో తమకు దాదాపు 60 శాతం మార్కెట్ వాటా ఉందని చెప్పారు.

 

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో జరిగే అమ్మకాల్లో సుమారు 20-25 శాతం వ్యాపారం తమ తరహా అనుబంధ పోర్టల్స్ నుంచే ఉంటోందని స్వాతి వివరించారు. ప్రస్తుతం దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈకామర్స్ మార్కెట్ 2020 నాటికి దాదాపు 100 బిలియన్ డాలర్లకు పెరగగలదని, తదనుగుణంగా క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు అందించే సంస్థలకు పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఇప్పటిదాకా క్యాష్‌బాక్‌ల రూపంలో సుమారు రూ. 35 కోట్లు వినియోగదారులకు అందచేయగలిగామన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తదితర వెయ్యి ఈకామర్స్ సైట్లు తమ ప్లాట్‌ఫాంపై ఉన్నట్లు స్వాతి చెప్పారు.

Advertisement
Advertisement