Sakshi News home page

భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

Published Sun, Mar 19 2017 12:02 AM

food poision

శివల (కె.గంగవరం) :
మండలంలోని శివల ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 17 మంది చదువుకుంటుండగా శనివారం 14 మంది హాజరై మధ్యాహ్న భోజనం తిన్నారు. బంగాళదుంప, ఉడకబెట్టిన కోడిగుడ్లను భోజనంలో వడ్డించగా  అవి తిన్న పది నిముషాలకు 11 మంది విద్యార్థులకు మెడ పై భాగంలో వాపు వచ్చి నొప్పి పుట్టింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన వారిని కుందూరు పీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించి రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆర్డీఓ కె.సుబ్బారావు, జిల్లా వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంఈఓ ఎ.నాగరాజు, ఎంపీటీసీ రవ్వా భూషణం పరామర్శించారు. విద్యార్థులు తిన్న మధ్యాహ్నం భోజనాన్ని పరీక్షల నిమిత్తం కాకినాడ పంపినట్లు ఎంఈఓ తెలిపారు.
 
 

Advertisement
Advertisement