గణపతి నవరాత్రోత్సవాలకు శ్రీకారం | Sakshi
Sakshi News home page

గణపతి నవరాత్రోత్సవాలకు శ్రీకారం

Published Sat, Aug 26 2017 10:44 PM

గణపతి నవరాత్రోత్సవాలకు శ్రీకారం - Sakshi

- శ్రీశైలంలో సెప్టెంబర్‌ 3 వరకు విశేష పూజలు 
- అప్పటి వరకు ఆర్జిత రుద్రహోమాలు రద్దు
·- నాలుగు అడుగులకుపైగా మృత్తికా (మట్టి) గణపతి 
శ్రీశైలం: వినాయక చవితి పురస్కరించుకొని శుక్రవారం శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాగణంలో ఉదయం 8.10 గంటలకు యాగశాలప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతి పూజతో అత్యంత వైభవంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈఓ భరత్‌ గుప్త .. ఉభయదేవాలయాల అర్చకులు, ప్రధాన అర్చకులు, వేదపండితుల స్వస్తిపుణ్యా హవచం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణదారణలతో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. సెప్టెంబర్‌  3 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. అప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో రత్నగర్భగణపతి, శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని సాక్షి గణపతికి నిత్యం వ్రతకల్పం విశేషార్చనలుంటాయన్నారు. అలాగే గత ఏడాది తరహాలోనే ఆలయప్రాంగణంలో మృత్తిక(మట్టి) గణపతిని నెలకొల్పి వ్రత కల్ప పూర్వకంగా పూజాధికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
శుక్రవారం ప్రారంభ పూజల అనంతరం యాగశాలలో అఖండస్థాపన, మండపారాధన, కలశస్థాపన నిర్వహించారు. సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ఉపాంగహవనాలు, గణపతి హోమం జరిపించారు. చివరిరోజు సెప్టెంబర్‌ 3 ఉదయం 10 గంటలకు గణపతిపూజ, మండపారాదనలు, కలశార్చనలు, గణపతిహోమం, రుద్రహోమం అనంతరం పూర్ణాహుతితో  ఉత్సవాలకు ముగింపు పలుకుతామన్నారు.  ఆ తర్వాత అలంకార మండపంలోని మృత్తికా గణపతిని నిమర్జనం చేస్తామన్నారు. 
 
  నవరాత్రులలో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల.. 
 గణపతి నవరాత్రులను పురస్కరించుకొని శుక్రవారం నుంచి  సెప్టెంబర్‌ 3  వరకు గణపతి హోమం, ఆర్జిత రుద్రాభిషేకం, ఆర్జిత మృత్యుంజయ హోమం, ఆర్జిత నవగ్రహ హోమం నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ  ప్రకటించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే చండీహోమాలు మాత్రం ఉత్సవ సమయంలో కూడా కొనసాగుతాయన్నారు. 
 
భక్తులకు సదావకాశం:..
గణపతి నవరాత్రోత్సవాల్లో ఆలయంలో చేపడుతున్న పుష్పాలంకరణలో భక్తులకు అవకాశం కల్పించాలని దేవస్థానం సంకల్పించిందని ఈఓ తెలిపారు. ఆసక్తి కల్గిన వారు పుష్పాలంకరణ కోసం విడిపూలు విరాళంగా సమర్పించవచ్చన్నారు.
 
 

Advertisement
Advertisement