భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి | Sakshi
Sakshi News home page

భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి

Published Mon, May 30 2016 10:57 AM

భూగర్భంలో కలిసిపోతున్న వినాయకుడి గుడి

వర్షం వస్తే నీటిలో మునిగిపోవడమే..
విగ్రహాలు తొలగించి చేతులు
దులుపుకున్న అధికారులు

 
 
సీతానగరం (తాడేపల్లి రూరల్): వినాయకుడి గుడి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోతోంది. కనకదుర్గమ్మ దత్తత దేవాలయమైన సీతానగరం శ్రీకోదండరామ ఆంజనేయస్వామి ఆలయం, రాష్ట్ర దేవాలయ పరిపాలన విభాగం (సీత కార్యాలయం) మధ్య ఈ గుడి ఉంది.  కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ శాఖ  నిర్లక్ష్యం వల్ల వినాయకుడి గుడికి ఈ పరిస్థితి దాపురించిందంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలప్పుడన్నా దేవాదాయ శాఖ అధికారులు దేవాలయాలకు మరమ్మతులు నిర్వహించేవారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరో 70 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 

సీత కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా వినాయకుడి గుడి పక్కనే 15 అడుగుల మెరక తోలారు. దీనివల్ల వర్షం కురిస్తే దేవాలయం నీటిలో మునిగిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో గుడిలో ఉన్న వినాయకుడి విగ్రహం, నాగేంద్రస్వామి విగ్రహాలను తీసివేసి, పక్కనున్న ఆంజనేయ స్వామి దేవాలయంలో భద్రపరిచారు. అప్పటి నుంచి భక్తులకు ఆ విగ్రహాల దర్శన భాగ్యం కలుగడంలేదు. పుష్కరాల కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ, వినాయకుడి గుడి  పునర్నిర్మాణం కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పక్కనే ఉన్న సీత కార్యాలయానికి కోట్ల రూపాయలు వెచ్చించి అధికారులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు గార్డెన్లు, వాకింగ్ టైల్స్ ఏర్పాటు చేసుకున్నారు.

ఎవరు ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట పూజించే బొజ్జ గణపతికి ఆలయ పునర్నిర్మాణం మాత్రం అధికారులు చేపట్టడం లేదు. గత సంవత్సర కాలంలో సీత కార్యాలయానికి దేవాదాయ శాఖ మంత్రి మూడు సార్లు వచ్చారు. అయినా పక్కనే ఉన్న వినాయకుడి గుడి దుస్థితిపై స్పందించలేదు. గతంలో రూ.18 లక్షలతో వినాయక గుడిని పునర్నిర్మించాలని టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని అలా వదిలేయడం మన దేవాదాయ శాఖ అధికారులకే చెల్లింది.
 

Advertisement
Advertisement