అక్రమ గ్యాస్‌కు రూ.11 వేల కోట్లు చెల్లించాలి | Sakshi
Sakshi News home page

అక్రమ గ్యాస్‌కు రూ.11 వేల కోట్లు చెల్లించాలి

Published Thu, Oct 13 2016 12:19 AM

అక్రమ గ్యాస్‌కు రూ.11 వేల కోట్లు చెల్లించాలి - Sakshi

 
తాళ్లరేవు : 
కేజీ బేసిన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ ఓఎన్‌జీసీ బ్లాకు నుంచి అక్రమంగా తరలించిన గ్యాస్‌కు సంబంధించి రూ.11 వేల కోట్లను ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్‌ కంపెనీ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి డి.శేషుబాబ్జీ మాట్లాడుతూ దేశంలోని సహజ సంపదను రిలయన్స్‌ సంస్థ దోచుకుంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు.  కృష్ణా–గోదావరి బేసిన్‌లో రిలయన్స్‌ సంస్థ ఓఎన్‌జీసీ బ్లాకు నుంచి రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను చోరీచేసిందన్నారు. ఈ అక్రమ తరలింపు వాస్తవమేనని ఏప్రియల్‌ 2009 నుంచి మార్చి 2015 మధ్య జరిగిన అక్రమాలపై నియమించిన జస్టిస్‌ షా కమిటీ కూడా తెలిపింది. ఈ మేరకు కమిటీ నివేదిక కూడా ఇచ్చినట్టు తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ కంపెనీలకు చెందాల్సిన ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని, తక్షణమే రిలయన్స్‌ సంస్థ నుంచి ఆ డబ్బులను రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమచేయాలని వారు డిమాండ్‌ చేశారు. జిల్లా   నాయకులు పలువురు మాట్లాడుతూ రిలయన్స్‌ సంస్థ ప్రధానంగా జిల్లాలో ఇంటింటికీ పైపులైన్‌ వేస్తామన్నారని, కనీసం ప్లాంటు ఉన్న తాళ్లరేవు మండలానికి కూడా ఇంటింటికీ గ్యాస్‌ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్‌ మెయిన్‌ గేటు వద్ధ ధర్నా నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టెర్మినల్‌ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. టెర్మినల్‌ గేటు వద్ద చొచ్చుకు పోయే ప్రయత్నం చేయగా రిలయన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. కోరంగి ఎస్సై బి.శ్రీనివాసరావు బృందం అక్కడకు చేరుకుని సీపీఎం నేతలను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.  జిల్లా నాయకులు కేఎస్‌ శ్రీనివాస్, బేబీరాణి, వీరబాబు, రమణి సీపీఎం మండల కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు, వి.రాజబాబు, దుర్గా ప్రసాద్‌ పాల్గొన్నారు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement