రూ.10 లక్షల ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ కట్ | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ కట్

Published Sun, Nov 15 2015 2:53 AM

రూ.10 లక్షల ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ కట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడాదికి రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై చర్చించి.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. ‘‘దేశంలో లక్షల సంఖ్యలో అక్రమ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వారందరికీ అక్రమంగా గ్యాస్ సబ్సిడీ అందుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే అక్రమంగా సబ్సిడీని పొందుతున్న వారితో పాటుగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, కార్పొరేట్ దిగ్గజాలకూ సబ్సిడీని నిలిపివేయనున్నాం’’ అని వెంకయ్య వివరించారు.

ఇప్పటికే దేశంలో 30 లక్షల మంది తమంతట తాము గ్యాస్ సబ్సిడీని వదులుకున్నారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీఏపీసీసీఐ) ఆధ్వర్యంలో శనివార ం ఇక్కడ ఎఫ్‌టీఏపీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డులు, సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... దేశ ప్రగతిలో కీలకభూమిక పోషిస్తున్న వ్యవసాయ రంగాన్ని, అన్నదాతలను ఆదుకునేందుకు ఎరువులకు కూడా నగదు రూపంలో సబ్సిడీని అందించనున్నట్లు వెల్లడించారు. గ్యాస్ సబ్సిడీ తరహాలోనే ఎరువుల సబ్సిడీని కూడా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి వేస్తామని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాలది కీలకపాత్ర అంటూ... ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు.

మొత్తం దేశ జీడీపీలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాటా 8.17 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్ వైపు ఉందన్నారు. ‘‘చైనా, యూరప్, అమెరికా దేశాలు ఆర్థికమాంద్యంలో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే రైల్వే, రిటైల్, నిర్మాణం, రక్షణ వంటి 15 రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించాం. దీంతో వివిధ ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తరలి వస్తాయి’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీఏపీసీసీఐ అధ్యక్షులు అనిల్ రెడ్డి వెన్నం, ఉపాధ్యక్షులు గౌర శ్రీనివాస్, అవార్డు కమిటీ చైర్మన్ శేఖర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
 
 అవార్డు గ్రహీతలు వీరే
  హిందుస్తాన్ ఏరోనాటికల్స్ (పారిశ్రామిక ఉత్పాదన), ఏజీఐ గ్లాస్‌ప్యాక్ (ఆల్‌రౌండ్ పనితీరు), గుబ్బా కోల్డ్ స్టోరేజ్ లి. (వ్యవసాయాధారిత పరిశ్రమ), మెటల్‌క్రాఫ్ట్ రోల్ ఫార్మింగ్ ఇండస్ట్రీస్ (మార్కెటింగ్ ప్రణాళికలు), టాటా కాఫీ లి. (ఎగుమతుల పనితీరు), కోస్టల్ కార్పొరేషన్ (ఎగుమతుల పనితీరు (చిన్న తరహా), ప్రీమియర్ సోలార్ సిస్టమ్స్ (సంప్రదాయేతర), బీహెచ్‌ఈఎల్ (ఉద్యోగుల సంక్షేమం),కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీ కార్పొరే షన్(కార్పొరేట్ సామాజిక బాధ్యత), ఫస్ట్‌ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ (వినూత్న ఉత్పాదన), కాల్‌టెక్ ఇంజనీరింగ్ (వినూత్న ఉత్పాదన (చిన్నతరహా), రెయిన్ బో స్త్రీ, పిల్లల ఆసుపత్రి (ఆరోగ్య సేవలు), నిమ్రా కేర్‌గ్లాస్ టెక్నిక్స్ (పరిశోధన, అభివృద్ధి (చిన్నతరహా), సీటీఆర్‌ఎల్ డేటా సెంటర్స్ (ఐటీ కంపెనీ), తెలంగాణ, ఏపీ పర్యాటక అభివృద్ధి శాఖలు (టూరిజం ప్రమోషన్), మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) (ఉత్తమ అసోసియేషన్), డీఆర్‌డీవో ‘హెచ్’ ప్రొగ్రామ్ డెరైక్టర్ అదాలత్ అలీ (శాస్త్రవేత్త / ఇంజనీర్).

Advertisement
Advertisement