బుచ్చి ఎస్‌బీఐలో గోల్డ్‌ లోన్ల గోల్‌మాల్‌ | Sakshi
Sakshi News home page

బుచ్చి ఎస్‌బీఐలో గోల్డ్‌ లోన్ల గోల్‌మాల్‌

Published Tue, Mar 14 2017 11:36 PM

బుచ్చి ఎస్‌బీఐలో గోల్డ్‌ లోన్ల గోల్‌మాల్‌ - Sakshi

- పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.12.40 లక్షల అవినీతి
- ఇద్దరు అధికారుల మీద సీబీఐ కేసు నమోదు


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నోట్ల రద్దు సమయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుచ్చిరెడ్డిపాళెం శాఖలో బంగారు రుణాల మంజూరు మాటున రూ.12.40 లక్షలు అవినీతి జరిగింది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుతో  బ్యాంకు సీనియర్‌ స్పెషల్‌ అసిస్టెంట్‌ ఎం.సుల్తాన్‌ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్‌ (ఆపరేషన్‌) ఐ.జె.రాజశేఖర్‌మీద కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్‌పీ ఆర్‌.గోపాలకృష్ణారావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా నగదు చెల్లింపు విషయంలో రిజర్వ్‌ బ్యాంకు అనేక షరతులు విధించింది. దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.10 వేల నగదు కూడా ఉపసంహరించుకోలేక అవస్థలు పడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్‌బీఐలో పనిచేస్తున్న సుల్తాన్‌ మొహిద్దీన్, రాజశేఖర్‌ ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడ్డారు. గత ఏడాది నవంబరు 15, 25 తేదీల్లో సుల్తాన్‌కు బినామీ పేర్ల మీద డిప్యూటీ మేనేజర్‌ రాజశేఖర్‌ నాలుగు బంగారు రుణాల కింద రూ.9.70 లక్షలు మంజూరు చేశారు. మరో మూడు బంగారు రుణాలు మంజూరు చేసి ఇందుకు సంబంధించి రూ.2.70 లక్షలు కొత్త రూ.500, రూ.2000 నోట్లు అందజేశారు.

ఇదే సమయంలో గత ఏడాది నవంబరు 21, నవంబరు 25వ తేదీల్లో  రూ.500 పాత నోట్లు జమ చేసి  సుల్తాన్‌కు మంజూరు చేసిన రెండు బినామీ రుణాలు క్లోజ్‌ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సుల్తాన్‌ మొహిద్దీన్‌ను సస్పెండ్‌ చేశారు. సీబీఐ అధికారులు శని, ఆదివారాల్లో  ఇందుకు సంబం«ధించి బ్యాంకు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో సంచలనం కలిగించింది. లోతుగా జరిపిన విచారణలో రూ.12.40 లక్షలు గోల్‌ మాల్‌ జరిగిందని తేల్చారు. దీంతో సుల్తాన్, రాజశేఖర్‌ మీద ఐపీసీ సెక్షన్‌ 120 ృబి రెడ్‌విత్‌ 420, 409, 1988 పీసీ చట్టం లోని సెక్షన్‌ 13(2), రెడ్‌ విత్‌ 13(1)(డి) సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉందని ఎస్‌పీ  గోపాలకృష్ణారావు తెలిపారు. అధికారులు ఇద్దరూ తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి అవినీతి పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలు, బీమా సంస్థల్లో అవినీతిపై ప్రజలు ఎస్‌పీ కార్యాలయం, సీబీఐ, విశాఖపట్నం చిరునామాకు నేరుగా గానీ, పోస్టు ద్వారా లేదా 1800 425 00100 టోల్‌ఫ్రీ నంబరుకు గానీ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement