గోవధ నిషేధం ఎఫెక్ట్‌ | Sakshi
Sakshi News home page

గోవధ నిషేధం ఎఫెక్ట్‌

Published Sun, May 28 2017 11:40 PM

గోవధ నిషేధం ఎఫెక్ట్‌ - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : కేంద్ర ప్రభుత్వం గోవధను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీన నేపథ్యంలో  స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో పశువుల సంతలో క్రయవిక్రయాలు బాగా తగ్గాయి. వారం వారం పెద్ద పెద్ద వాహనాల్లో వందలాది పశువులు ఇతర రాష్ట్రాల కబేళాలకు వెళ్లేవి. కానీ ఈ వారం అంతగా హడావిడి కనిపించలేదు. అందువల్లే రూ.50 వేల వరకు మార్కెట్‌ ఫీజు వసూలు అవుతుండగా, ఈ వారం రూ.25 లోపు వసూలైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, మధ్య దళారీలు తాకిడి కూడా తగ్గింది.

సంతలో క్రయ విక్రయాలు చేస్తున్న కటిక వ్యాపారులు, దళారీలు కొందరిని మార్కెట్‌యార్డు అధికారులు బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. కొందరు వెళ్లిపోగా మరికొందరు చాటుమాటున వ్యాపారాలు సాగించారు. గతంలో పదుల సంఖ్యలో పెద్ద పెద్ద వాహనాలు మార్కెట్‌యార్డు ప్రాంగణంలోనే ఒక్కో వాహనంలో 20 నుంచి 30 పశువులను కుక్కించి తీసుకెళుతుండగా, ఈ వారం రెండు పెద్ద వాహనాలు మాత్రమే లోపల కనిపించాయి. రైతులమంటూ కొందరు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చిన పశువులు, ఎద్దులు, గేదెలను కొనుగోలు చేసి వాటికి రంగులు వేయడం కనిపించింది. రంగులు వేశారంటే దాదాపు కబేళాలకు తరలించడానికే అని చెబుతున్నారు. పగలు కాకున్నా రాత్రిళ్లు కబేళాలకు రవాణా చేసేందుకు కొందరు సిద్ధమైనట్లు సమాచారం. వచ్చే వారం నుంచి ఆధార్, ఇతరత్రా వివరాలు ఆధారంగా క్రయ విక్రయాలు చేయడానికి చర్యలు తీసుకుంటామని యార్డు అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement