దసరా నుంచే పాలన | Sakshi
Sakshi News home page

దసరా నుంచే పాలన

Published Tue, Aug 2 2016 12:30 AM

దసరా నుంచే పాలన - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : హరితహారంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. మళ్లీ జిల్లాల పునర్విభజనపై వేగం పెంచింది. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు సీఎం పేషీ నుంచి ఉన్నతాధికారులకు చీఫ్‌ సెక్రటరీ కార్యాలయం నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై నిజామాబాద్‌ నుంచి ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పు లేకుండా త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూట్‌మ్యాప్‌ను ప్రకటించేందుకు ఈ నెల 4న మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. సాధ్యాసాధ్యాలపై అన్ని కోణాల్లో సమీక్ష జరిగిన పిదప 10న కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారన్న చర్చ జిల్లాలో జోరందుకుంది. అయితే ఇప్పుడున్న మండలాలతోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై స్పష్టత రానుంది.
సీఎం సమీక్షలు
ప్రజాప్రతినిధులు, అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన సీఎం కేసీఆర్‌ దసరా నుంచే కొత్త జిల్లాల్లో పాలన ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే జూలై 8 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో అధికార యంత్రాంగం సుమారు 23 రోజులపాటు బిజీగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా అక్టోబర్‌ 11 గడువు సమీపిస్తుండగా.. మళ్లీ పునర్విభజనపై వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ 4వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. నిజామాబాద్‌కు సంబంధించి ఇదివరకే కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియపై జరుగుతున్న కసరత్తు, మార్పులు, చేర్పులకు సంబంధించిన తుది నిర్ణయాలను సీఎం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లాలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరుగనుంది. దీనికి సంబంధించి కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా అందించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌ వెల్లడించగా, దాదాపుగా ప్రజాప్రతినిధులు అంగీకారం తెలిపారు. ఈ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నదున్నట్లుగా ఆమోదించి 10న నోటిఫికేషన్‌లో ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. మొదట రాష్ట్రంలో 14 కొత్త జిల్లాలు, 74 మండలాలు ఏర్పాటు చేయాలనుకున్నా.. మండలాల జోలికి వెళ్లకుండా 12 రెవెన్యూ డివిజన్లను ప్రకటించనున్నారు. ఒక్కో జిల్లాకు సగటున 20 మండలాలు ఏర్పాటు కానున్నాయి. ఇలా జరిగితే కొత్తగా బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌ ఏర్పడనుండగా.. 36 మండలాల్లో నాగిరెడ్డిపేట మెదక్‌ జిల్లాలో కలిస్తే నిజామాబాద్‌ జిల్లాలో 17 మండలాలు, కామారెడ్డిలో 18 మండలాలు ఉంటాయంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి, వర్ని మండలాలు కూడా అక్కడి ప్రజల కోరిక మేరకు నిజామాబాద్‌ జిల్లాలోనే కొనసాగించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
నిర్మల్‌ జిల్లా కాకుంటే బాసర ఇటే
పునర్విభజనలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటు ఖాయమైంది. నిజామాబాద్‌ జిల్లాలో నిజమాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, ఆర్మూరు, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలతో నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో కామారెడ్డి జిల్లాలుగా ఏర్పడనున్నాయని తెలుస్తోంది. ఇదిలా వుంటే ప్రస్తుతం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 25,51,335 మంది కాగా, జిల్లా 7,956 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. విభజన అనంతరం నిజామాబాద్‌ జిల్లా 14,47,961 మంది జనాభాతో 3,772 చ.కి.మీ.లు, కామారెడ్డి జిల్లా 10,68,773 మందితో 4,025 చ.కి.మీ. వైశాల్యంలో ఉండనున్నాయి. ఇదిలా వుంటే ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న బాసరను నిజామాబాద్‌ జిల్లాలో కలపాలన్న డిమాండ్‌ ఉంది. ఇందుకోసం మార్పులు, చేర్పులు చేయాలన్న ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బాసర, నిజామాబాద్‌కు చెందిన నేతలు అఖిలపక్షంగా ఏర్పడ్డారు. నిజామాబాద్‌కు 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసరను ఇందూరులో కలపడమే న్యాయమన్న చర్చ కూడా జరిగింది. బాసరతో పాటు ముథోల్‌ కూడా నిజామాబాద్‌లో కలుపాలని ప్రతిపాదనలు కూడా చేశారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ జిల్లా ప్రతిపాదనకు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించినా నిర్ణయం ప్రకటించ లేదు. గురువారం మరోమారు సీఎం నిర్వహించే ఉన్నతస్థాయి సమావేశంలో నిర్మల్‌తో పాటు కరీంనగర్‌లో సిరిసిల్ల జిల్లాలపై చర్చ జరగనుంది. ఒకవేళ నిర్మల్‌ జిల్లా ఏర్పాటు సానుకూలత రాకపోతే బాసర నిజామాబాద్‌లో కలవడం ఖాయం కానుందన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 10న ఎట్టకేలకు నోటిఫికేషన్‌ వెలువడనుండగా.. 4న జరిగే సమావేశం పునర్విభజనకు కీలకం కానుంది.
 

 
Advertisement
 
Advertisement