'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా' | Sakshi
Sakshi News home page

'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా'

Published Thu, Oct 8 2015 11:12 AM

'కంటికి కాంట్రాక్టర్లే కనిపిస్తారా.. బీదవారు కనిపించరా' - Sakshi

గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అందుకే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాలుగా పోరాడి నిరవధిక నిరాహార దీక్షకు దిగారని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి రెండో రోజుకు చేరింది.

ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి దీక్ష వద్ద మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. కార్పొరేట్ సంస్థలను, బడా కాంట్రాక్టర్లను మాత్రమే చూస్తున్న ప్రభుత్వం రైతులను మాత్రం పక్కకు పెట్టేసిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న బకాయిలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోమంటూ ప్రత్యక్షంగా చెబుతోందని, ఇతర సంస్థలకు ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు.

పరిశ్రమల బకాయిలు చెల్లించేటప్పుడు గుర్తుకు రాని కాంగ్రెస్ ప్రభుత్వం హయాం ఒక్క రైతుల విషయంలో ఎందుకు గుర్తుకువస్తుందని ప్రశ్నించారు. కార్మికులు రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారారని ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుందని చెప్పారు. ప్రతిసారి పరిశ్రమల గురించి, పారిశ్రామిక వేత్తల గురించి మాట్లాడే ప్రభుత్వానికి పేదలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇప్పటి వరకు ఒక్క ఇళ్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement