ఇంకెందరు అమాయకులు బలికావాలి? | Sakshi
Sakshi News home page

ఇంకెందరు అమాయకులు బలికావాలి?

Published Sun, Sep 18 2016 10:54 PM

ఇంకెందరు అమాయకులు బలికావాలి? - Sakshi

పల్లెంపల్లి(వీరులపాడు) :
ప్రభుత్వ నిర్లక్ష్యంపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రం వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆజమాయిషీలోనే జరుగుతున్నాయా అని అధికారులను ప్రశ్నించారు. అయితే కనీస జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని సంఘటనా స్థలానికి చేరుకున్న నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రమాదం జరిగితే మధ్యాహ్నం వరకు ప్రజా ప్రతినిధులు కానీ, ప్రభుత్వాధికారులు రాలేదని విమర్శించారు. నందిగామ ప్రాంతంలో మూడునెలల్లో 9 మంది అమాయకులు ఇలాంటి ఘటనల్లో బలైనా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు, ఈ ఘోరానికి కారణమైన కాంట్రాక్టర్, ప్రభుత్వాధికారులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. 

రూ.10 లక్షలు పరిహారమివ్వాలి 
 ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందించాలని నేతలు ఉదయభాను, జగన్ మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాడటం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కోటేరు ముత్తారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆవుల రమేష్‌ బాబు, రాష్ట్ర యూత్‌ సంయుక్త కార్యదర్శి కొండా కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి మంగునూరి కొండా రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు షహనాజ్‌ బేగం, సర్పంచ్‌ వెంకట్రావమ్మ, నాయకులు నర్సిరెడ్డి, కోలా కుమారి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement