రాయలసీమపై ప్రభుత్వం నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

రాయలసీమపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Published Tue, Nov 10 2015 1:29 AM

Government negligence on the Rayalaseema

♦ చంద్రబాబు సర్కార్‌పై మిత్రపక్షం బీజేపీ ఆగ్రహావేశాలు
♦ సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తేవాలని నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: కరువుతో అల్లాడే రాయలసీమపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మిత్రపక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రతీ విషయంలోనూ సీమకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయానికొచ్చింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో పార్టీ సీమ నేతలతో సమావేశం నిర్వహించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇందులో సీమకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించినట్లు సమాచారం.

శ్రీశైలంలో 100 టీఎంసీల మేర నీరున్నా సీమకు సాగునీరు ఇవ్వకుండా, తాగు నీటి అవసరాల పేరిట నీటి విడుదలకు ప్రభుత్వం పూనుకోవడాన్ని నేతలు తప్పుబట్టారు. నిబంధలను పక్కనబెట్టి పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం, సీమ ప్రాజెక్టుల విషయానికొచ్చేసరికి నిబంధనల పేరు చెప్పి మూలన పడేస్తున్నారని నేతలు అభిప్రాయానికొచ్చారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. సీమకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టే చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఇక్కడి ప్రధాన సమస్యలపై ఒక నివేదిక రూపొందించి,  కేంద్రం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక ప్యాకేజీ అడగాలని నిర్ణయించారు.

 సీమ మేధావుల ఉద్యమానికి దూరంగా..
 రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలపై ఆ ప్రాంత మేధావులు చేపట్టిన ఉద్యమానికి పార్టీ నేతలు దూరంగా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.

Advertisement
Advertisement