బాబును నమ్మి మోసపోయా! | Sakshi
Sakshi News home page

బాబును నమ్మి మోసపోయా!

Published Thu, Mar 3 2016 1:27 AM

బాబును నమ్మి మోసపోయా! - Sakshi

♦ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదు
♦ కాపు జాతి కోసం మళ్లీ రోడ్డెక్కుతా: ముద్రగడ
♦ రెండు మూడు రోజుల్లో కార్యాచరణ
 
 సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నమ్మి మోసపోయానని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పారు. తమ జాతి కోసం అవసరమైతే మళ్లీ రోడ్డెక్కుతానని, బెదరనని స్పష్టం చేశారు. ఒకసారి రోడ్డెక్కాక ఏదైనా జరగొచ్చన్నారు. అనారోగ్యంతో ఉన్న జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ తల్లి లక్ష్మీదేవిని పరామర్శించడానికి ముద్రగడ బుధవారం విశాఖ వచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనతో ఆమరణ దీక్ష విరమింపజేసేందుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన చెప్పారు.

‘నేను దీక్షకు దిగినప్పుడు సీఎం చంద్రబాబు పెద్దలను పంపి కాపులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దురదృష్టం కొద్ది ఆ మాటలు నమ్మాను. దీక్ష విరమించాను. మోసపోయాను. ఆయనను నమ్మడం పొరపాటే..’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీలతో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు దగా పడ్డారన్నారు. ఇప్పుడు కాపులూ మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి తొలుత రూ. 2 లక్షల రాయితీ రుణాలిస్తామన్నారని, తీరా ఇప్పుడు రూ. 40 వేలకు కుదించేశారని, పైగా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు.

కాపు ఉద్యమంలో పాల్గొన్న యువకులకు ఈ రుణాలివ్వడం లేదని, వారిని టైస్టులుగా చూస్తూ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. కాపు కమిషన్‌లో తమ తరఫున ఒక రిని సభ్యునిగా నియమిస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు. సీఎం చెప్పిందొకటి, చేసేదొకటిలా ఉందన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సీఎం మోసపూరిత హామీలపై రెండు, మూడు రోజుల్లో కాపు ముఖ్య నేతలతో భేటీ అయి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. తాము ఏ కులానికీ వ్యతిరేకం కాదని, ఏ పార్టీకి కొమ్ముకాయడం లేదని చెప్పారు. తన వెనక వైఎస్సార్‌సీపీ ఉందంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో పలువురు కాపు నేతలు కూడా పాల్గొన్నారు.

Advertisement
Advertisement