ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుంది | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుంది

Published Sun, Jul 31 2016 11:10 PM

government punished to labours

  •  హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌
  • మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని హైకోర్టు న్యాయవాది, తెలంగాణ గ్రామ పంచాయితీ కారోబార్స్, బిల్‌ కలెక్టర్స్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు  చిక్కుడు ప్రభాకర్‌ ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ బాధ్యతలు విస్మరించిందని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నేషనల్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలీచాలని వేతనాలిస్తుందని, అవి కూడా ఆరు నెలలకోసారి ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తుందని అన్నారు. గ్రామ పంచాయితీ ఉద్యోగుల దుస్థితిని చూడలేక తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి 12 వారాలు వాదనలు వినిపించిన సందర్భంగా ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.613ను జారీ చేసిందని అన్నారు. తాను ఫిల్‌లో లేవనెత్తిన 9 చట్టాలను పరిశీలించి జీఓఆర్టీ 613ను అమలు చేసేందుకు కమిటీని నియమించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు జీఓ ఆర్టీ నెం.613ను అమలు చేయకుండా కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం పంచాయితీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. జయశంకర్‌ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం రావాలంటే వెంటనే జీఓ ఆర్టీ 613ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.చక్రధర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.నర్సిములు, ప్రధానకార్యదర్శి సి.శ్రీనివాసాచారి, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎండీ రంజాన్‌ అలీ, అంజయ్య, నాయకులు ఆంజనేయులు, మక్బుల్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, మురళి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement