మళ్లీ భూ సేకరణ ! | Sakshi
Sakshi News home page

మళ్లీ భూ సేకరణ !

Published Fri, Jun 30 2017 11:49 PM

మళ్లీ భూ సేకరణ ! - Sakshi

- ‘కియా’ కోసం మరో 2 వేల ఎకరాలను సేకరించనున్న ప్రభుత్వం ?

పెనుకొండ : కియా కార్ల పరిశ్రమకు ప్రస్తుతం 600 ఎకరాల భూమిని  సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందన్న వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  మొదటి విడతలో సేకరించిన భూమిలో ఇప్పటికే రూ. 177 కోట్లతో భూమి చదును పనులు ప్రారంభం కాగా ఆ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతుకు ఎకరాకు రూ.10.50 లక్షలు పరిహారంగా ఇచ్చిన ప్రభుత్వం చదునుకు మాత్రం ఎకరాకు దాదాపుగా రూ. 30 లక్షలు మంజూరు చేసింది. ఇందులో కూడా భారీ కుంభకోణం దాగి ఉందనే విమర్శలున్నాయి.

అయితే దీనిని ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం మరోసారి 2 వేల ఎకరాల భూమిని సేకరించడానికి రంగం సిద్ధమైందని రైతులు చెబుతున్నారు. మూడు ప్రాంతాల్లో ఈ భూములను సేకరించి కియా కార్ల సంస్థకు అనుగుణంగా భూమి దగ్గర ప్రాంతంలో ఉండేలా కేటాయించాలని అధికారులు నిర్ణయించారని అంటున్నారు. ఈ ప్రాంతంలో  భూములు కొన్న పలువురు ఔత్సాహికులు సైతం ఆందోళనలో  ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరా భూమిని ఏకంగా కోటి రూపాయలకు దరిదాపుల్లో అగ్రిమెంట్లు కుదుర్చుకున్న బెంగళూరు,. చెన్నై వ్యాపారవేత్తలు  ప్రస్తుతం ఆ భూములను అమ్ముకుంటే చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.

దుద్దేబండ రహదారి ప్రక్కన, రైల్వే ట్రాక్‌ సమీపంలో, ఎర్రమంచి, హరిపురం, వెంకటగిరిపాళ్యం గ్రామాల సమీపంలో ఈ భూసేకరణ ఉంటుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.  ఆరంభంలోనే ప్రభుత్వం 2500 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మద్దతుగా అమ్మవారుపల్లి వద్ద సమావేశం కూడా నిర్వహించి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. రైతుల కోసం రిజర్వాయర్‌ నిర్మిస్తే దానిని పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసినట్లు అవుతోందని విమర్శించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. పనులు ప్రారంభం కాగానే  మళ్లీ భూసేకరణ పై ఊహాగానాలు జోరందుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

రికార్డులు సేకరిస్తున్నాము - ఆర్డీఓ రామమూర్తి
ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడతలో  600 ఎకరాలకు రైతుల నుంచి రికార్డులు సేకరిస్తున్నాము. పూర్తి నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాము. ఇప్పటికే పలువురు రైతులు తమ  భూములకు సంబంధించిన రికార్డులు అందించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement