డాక్టర్లు తీరు మార్చుకోవాలి | Sakshi
Sakshi News home page

డాక్టర్లు తీరు మార్చుకోవాలి

Published Thu, Mar 31 2016 1:14 AM

డాక్టర్లు తీరు మార్చుకోవాలి - Sakshi

సంపాదనే ధ్యేయంగా పనిచేయడం తగదు: గవర్నర్

 విజయవాడ(హెల్త్ యూనివర్సిటీ): సంపాదనే ధ్యేయంగా వైద్యం చేసే డాక్టర్లు తమ తీరు మార్చుకోవాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. విజయవాడలో బుధవారం జరిగిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 18వ, 19వ స్నాతకోత్సవానికి వర్సిటీ కులపతిగా గవర్నర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... ఈతరం వైద్యులు కేవలం క్లినికల్ పరీక్షల ద్వారానే రోగాన్ని తెలుసుకునేందుకు పరిమిత మవుతున్నారన్నారు. ఇన్‌ఫెక్షన్ సోకుతుందనే నెపంతో వచ్చిన ప్రతి రోగినీ ఐసీయూల్లో చేర్చి, నెలల తరబడి ఉంచుతున్నారన్నారు. వారి గాలి వారే పీల్చుకునే పరిస్థితి ఉత్పన్నమైతే ఇన్‌ఫెక్షన్ సోకదా అని ప్రశ్నించారు.

వైద్య పరికరాల ఖర్చు రాబట్టుకునే ప్రయత్నంలో నైతిక విలువలు లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడం తగదన్నారు. చనిపోయిన వ్యక్తికి ఈసీజీ తీసి బిల్లు వేసి మృతి చెందిన విషయాన్ని నిర్ధారించడం శోచనీయమన్నారు. వైద్య చికిత్సలకయ్యే ఖర్చులు వేర్వేరుగా ఉంటున్నాయని, అలా కాకుండా ప్రముఖ వైద్యులు చర్చించి, ఖర్చు పట్టికను రూపొందించి ప్రతి ఆసుపత్రి నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రతి వైద్య విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని సూచించారు. రోగిని వైద్యుడు ప్రేమతో తట్టే స్పర్శ చాలా శక్తివంతమైందన్నారు.

 డాక్టర్ కె.ఎస్.చుగ్‌కు గౌరవ డాక్టరేట్
 మూత్రపిండాల శాస్త్ర పితామహుడు డాక్టర్ కిరపాల్‌సింగ్ చుగ్(కె.ఎస్.చుగ్)కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్, వర్సిటీ వీసీ టి.రవిరాజు అందజేశారు. కె.ఎస్.చుగ్ మాట్లాడుతూ.. 1955లో ఎంబీబీఎస్ పూర్తయిన అనంతరం 23 ఏళ్ల వయస్సులో పంజాబ్ యూనివర్సిటీలో ఎండీ(మెడిసిన్) కోర్సులో చేరానని, అప్పట్లో దేశంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి స్పెషాలిటీ కోర్సు ఎక్కడా లేదని తెలిపారు. అయినా కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక సబ్జెక్టుగా ఎంచుకోగా వర్సిటీ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని, మ్యాడ్‌మ్యాన్ అన్నారన్నారు. అయినా పట్టువిడవకుండా ప్రయత్నం చేస్తే 9 నెలల తరువాత అనుమతి ఇచ్చారని, అలా కిడ్నీ స్పెషలిస్టు కావాలన్న తన కలను సాకారం చేసుకున్నానని వెల్లడించారు.  స్నాతకోత్సవంలో 13 మందికి పీహెచ్‌డీ, 12 మందికి సూపర్ స్పెషాలిటీ, 97 మందికి స్వర్ణ, 46 మందికి రజత పతకాలు, 42 మందికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. 

Advertisement
Advertisement