రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Published Tue, May 16 2017 12:05 AM

రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం - Sakshi

  •  సీమ నుంచి 10 లక్షల మంది వలసెళ్లారు
  • ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఇచ్చి..రైతులను ఆదుకోవాలి
  • రైతుధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి
  •  

    బెళుగుప్ప :

    వరుస కరువులతో సతమతమవుతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం బెళుగుప్ప తహసీల్దార్‌ కార్యాలయం ముందు స్థానిక సర్పంచ్‌ రామేశ్వరరెడ్డి అధ్యక్షతన రైతుధర్నా నిర్వహించారు. 

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం ఒకటని గుర్తు చేశారు. జిల్లా సాధారణ వర్షపాతం 520 మిల్లీమీటర్లు కాగా,  గత ఏడాది 250 మి.మీ మాత్రమే నమోదైందన్నారు. దీనివల్ల నల్లరేగడి భూముల్లో విత్తనం కూడా పడలేదన్నారు. కరువు విలయతాండవం చేస్తున్నా ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా అందించకుండా  ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఇప్పటికే రాయలసీమ నుంచి పది లక్షల మంది వలసలు వెళ్లారన్నారు. వారిని ఆదుకోకపోగా, అధిక ఆదాయం కోసమే వెళుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఎక్కడైనా ఫ్యాక్టరీలకు నష్టం జరిగితే రూ.కోట్ల బీమా చెల్లిస్తారు గానీ, పంట నష్టపోయే రైతులకు మాత్రం ప్రీమియం కూడా తిరిగివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    బ్యాంకుల్లో పంట రుణాలు రెన్యూవల్‌ చేయించలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. వారు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన మిర్చి, వేరుశనగ, పసుపు, చీనీ, వరి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. హంద్రీ-నీవా మొదటిదశ కింద డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఉరవకొండ నియోజకవర్గంలో  80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని, ఊటనీటితో ఇబ్బందులు పడుతున్న  జీడిపల్లి వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ రైతు ధర్నాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు.

    కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బెళుగుప్ప మండల కన్వీనర్‌ శ్రీనివాస్‌, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప,  పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దుద్దేకుంట రామాంజినేయులు,  మండల మహిళా అధ్యక్షురాలు అంకంపల్లి యశోదమ్మ,  ఎర్రగుడి సర్పంచ్‌ అనిత, మండల ప్రధాన కార్యదర్శ అశోక్,  ఎస్సీసెల్‌ కన్వీనర్‌ తిప్పేస్వామి, రైతు విభాగం నాయకులు భాస్కర్‌రెడ్డి, సుదర్శనరెడ్డి, మచ్చన్న, నంజుండప్ప, రవీంద్ర, కేసీ తిప్పేస్వామి, శ్రీశైలప్ప తదితరులు పాల్గొన్నారు.

     

Advertisement

తప్పక చదవండి

Advertisement