బిందు సేద్యానికి గ్రీన్ సిగ్నల్

16 Jul, 2016 18:15 IST|Sakshi

► ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, ఓసీలకు 50 శాతం రాయితీ
► సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు సరఫరా
► మీ సేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు

ఒంగోలు టూటౌన్ : బిందు సేద్యం(సూక్ష్మనీటి సాగుపథకం) అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి పరిరక్షణ, పంటల ఉత్పత్తి సామార్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణికి మించకుండా ఉన్న రైతులకు లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వగా ఈ ఏడాది దానిని రూ.2 లక్షలకు పెంచారు. ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు సాగు చేసే రైతులకు రూ.2.80 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నారు.

సన్నకారు రైతులు 2.5 ఎకరాల మెట్ట లేదా 1.5 ఎకరాల మాగాణి కలిగిన రైతులు, చిన్న కారు(ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణి) రైతులకు 90 శాతం రాయితీ ఇస్తారు. పది ఎకరాలు పైబడి సాగు చేసే రైతులకు(పెద్ద రైతులకు) 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. గత ఏడాది పెద్ద రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. ఇప్పడది రూ.4 లక్షలకు పెంచారు. గత ఏడాది డ్రిప్ పొందిన రైతులు ఎవరైనా లక్ష రూపాయల వరకు సబ్సిడీ వినియోగించుకుని ఉంటే ఈ ఏడాది ఆ రైతులకు మరో రూ.లక్ష వరకు సబ్సిడీ పొందే అవకాశం కల్పించారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి రాయితీ కల్పించారు. ఐదేళ్ల పైబడిన డ్రిప్ పరికరాలు మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త డ్రిప్ పరికరాలను 50 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. తుంపర సేద్యం పైపులు(స్పింక్లర్లు), రెయిన్ గన్స్ అమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. వాటిని 50 శాతం రాయితీపై ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.

దరఖాస్తు విధానం
బిందు సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు మీ సేవలో సంప్రదించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌తో పాటు భూ యాజమాన్యపు హక్కు పత్రం, (టైటీల్ డీడ్ లేదా 1బీ రిజర్వు కాపీ), అడంగల్ కాపీ, ఎఫ్‌ఎమ్‌బీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఎస్సీ, ఎస్టీ రైతులు అయితే సంబంధిత కులధ్రువీకరణ పత్రం జత చేయాలి. పరికరాలు కావాల్సిన రైతులు మీసేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

నిబంధనలు ఇవీ.. 
మీ సేవలో దరఖాస్తు చేసుకున్న పది రోజులకు ఏపీఎంఐపీ ఫీల్డ్ స్టాఫ్, అధికారులు రైతు పొలాన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ సమయంలో రైతు పొలంలో పంట వేసి ఉండాలి. తప్పని సరిగా బోరు ఉండాలి. అనంతరం రైతుకు ఇచ్చే రాయితీలు(సబ్సిడీ, నాన్ సబ్సిడీ వివరాల మొత్తం రైతు ఫోన్ నంబర్‌కు మెసెజ్  రూపంలో తెలియజేస్తారు. బిందు సేద్యానిక సబ్సిడీపోను మిగిలిన నగదును ప్రాజెక్టు డెరైక్టర్, ఏపీఐపీ, పేరు మీద డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుందని ఏపీఎంఐపీ డెరైక్టర్ టి.బాపిరెడ్డి తెలిపారు.

ప్రభుత్వ గుర్తింపు పొందిన మైక్రో ఇరిగేషన్ కంపెనీలు
డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రైతులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పలు కంపెనీలను గుర్తించింది. సుధాకర్ కంపెనీ, సిగ్నెట్, ప్రీమియర్, నెటాపిమ్, కొటారి, గోదావరి, ఫినోలెక్స్, హరిత, నాగార్జున, జైన్, కుమార్, నంది, కిసాన్, విశాఖ కంపెనీల్లో దేనినైనా రైతు ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కంపెనీ అందించే పరికరాలకు పదేళ్లపాటు కంపెనీయే సర్వీస్ చేస్తుందని పీడీ తెలిపారు. అయితే ఒక సారి డ్రిప్ పరికరాలు పొందిన రైతులు పదేళ్ల వరకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు