మా బాధలు తీర్చండయ్యా.. | Sakshi
Sakshi News home page

మా బాధలు తీర్చండయ్యా..

Published Mon, Aug 1 2016 9:11 PM

మా బాధలు తీర్చండయ్యా.. - Sakshi

 
  •  పోలీసు అధికారులకు పలువురి వేడుకోలు 
  •  గ్రీవెన్స్‌డేలో అర్జీల సమర్పణ 
 
నెల్లూరు(క్రైమ్‌): రకరకాల సమస్యలతో బాధలు పడుతున్నాం. మీరైనా స్పందించి న్యాయం చేయండి..అంటూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు తమ గోడును పోలీసు అధికారులకు చెప్పుకున్నారు. నెల్లూరు పోలీస్‌ గ్రౌండ్‌లోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నెల్లూరు సిటీ, రూరల్‌ డీఎస్పీలు జి.వెంకటరాముడు, డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డికి అర్జీలు సమర్పించారు. 
 
హింసించి ఇంట్లో నుంచి గెంటేశారు: డి.అఖిల, ఎన్జీవో కాలనీ, నెల్లూరు 
నాకు 2013లో ప్రకాశం జిల్లా పొదిలి మండలం వేలూరుకు చెందిన డి.వెంకటప్రసాద్‌తో పెళ్లయింది. కొద్ది రోజులు మా కాపురం బాగానే ఉంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త శేషమ్మ వేధించడం ప్రారంభించారు. 2014 జూలైలో బాబు పుట్టిన తర్వాత పుట్టింటి వారు ఇచ్చిన నగలను అమ్ముకున్నారు. ఆ తర్వాత రూ.2 లక్షలు తెస్తేనే ఇంటికి రావాలని, లేకుంటే కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్త చిత్రహింసలు పెట్టింది. చివరకు గత ఏడాది డిసెంబర్‌ 25న నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. 
విచారించి నాకు న్యాయం చేయండి. 
 
చీటీల వ్యాపారి మోసగించాడు: ఎ.జగదీష్, సునీల్‌రెడ్డి, మనుబోలు 
మేము ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము. సంపాదించిన దాంట్లో కొంత నగదు కూడబెట్టుకొని మనుబోలు కోదండరామపురానికి చెందిన మల్లికార్జునరెడ్డి వద్ద చీటీలు వేశాము. మాతో పాటు అనేకమంది అతని వద్ద రూ. 80లక్షల వరకు చీటీలు వేశారు. చీటిలు పాడుకోగా మాకు రావాల్సిన నగదు ఇవ్వకుండా రేపు, మాపూ అంటు కాలయాపనచేస్తూ కొంతకాలం కిందట ఉడాయించాడు. అప్పటి నుంచి అతని ఆచూకీS తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్‌ఐ నాగరాజు నిందితుడ్ని పిలిపించి రాత్రికి రాత్రే వదలివేశాడు. ఉన్నతాధికారులు స్పందించి మాకు డబ్బులు ఇప్పించండి. 
 
చెట్లను కొట్టేశారు   యరగల కృష్ణమూర్తి, నాగమాంబపురం, బుచ్చిరెడ్డిపాలెం 
నేను దివ్యాంగుడిని. నాకు నాగమాంబపూరంలో 0.99సెంట్ల భూమి ఉంది. ఆ భూమిలో వేప, తాటి చెట్లతో కూడిన కరగాడ ఉంది. ఆ భూమిని ఆనుకొని ఉత్తరం వైపు 6.52 సెంట్ల స్మశానం ఉంది. మా గ్రామానికి చెందిన రాఘవరెడ్డి శ్మశానానికి ప్రహరీ కట్టించడం కోసమని కరగాడలోని చెట్లను కొట్టేశారు.  ఈవిషయమై కోర్టులో దావా వేయగా విచారణ జరుగుతోంది. నా చెట్లను కొట్టివేసిన నిందితునిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రహరీని శ్మశాన భూమిలోని కట్టేలా చర్యలు తీసుకోండి. 
 
కారుణ్య మరణానికి అనుమతించండి  పులీంద్ర మరియమ్మ, దగదర్తి  
నేను, నా భర్త చిన్నయ్య ఇద్దరం షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నాం. మా ఆయన ఆరోగ్యం రోజురోజుకూ దెబ్బతింటోంది. ఆయనను ఆస్పత్రిలో చూపించేందు కోసం మా ఆధీనంలో ఉన్న భూమిని అమ్ముకోవాలని అనుకుంటే నా భర్త అన్న అయిన రమణయ్య కుటుంబసభ్యులు అడ్డుకుంటున్నారు. మా పై దౌర్జన్యం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి..లేదంటే కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వండి.

Advertisement
Advertisement