ఆయన రూటే సెప‘రేటు’ | Sakshi
Sakshi News home page

ఆయన రూటే సెప‘రేటు’

Published Sun, Jul 30 2017 10:48 PM

ఆయన రూటే సెప‘రేటు’ - Sakshi

వీఆర్వో వసూళ్లపర్వం
పైసలివ్వనిదే ఫైలు ముందుకు కదలదు
తహసీల్దార్‌ కార్యాలయమే అడ్డా
ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం  


అక్కడ ప్రతి పనికీ ఓ రేటు. ఆ ప్రకారం ముట్టజెప్పకపోతే పని ముందుకుసాగదు. కాసులు పడితే కానీ పెన్ను, ఫైలు కదలదు. తనకు సంబంధం లేకపోయినా అన్నీ తానై ఓ చిరుద్యోగి వ్యవహరిస్తున్నాడు. ఆయన మరో ఇద్దరు అనధికారిక వ్యక్తులను నియమించుకుని ఆన్‌లైన్‌ వ్యవహారాలను కూడా చక్కబెట్టిస్తున్నాడు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ.. మొత్తం తహసీల్దార్‌ కార్యాలయాన్నే తన అడ్డాగా మార్చేసుకున్నాడు. వీఆర్వో కాస్తా.. వసూల్‌ రాజాగా మారిపోయాడు.

గుంతకల్లు రూరల్‌: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. విద్యార్థులకు అవసరమైన కుల, ఆదాయ, రెసిడెన్స్‌, జనన, మరణ, వంశవృక్ష  ధ్రువీకరణ పత్రాలతోపాటు రైతులు ఆన్‌లైన్‌లో భూ రికార్డుల సవరణలు, కొత్త పాసుపుస్తకం తదితర ఏ పని కోసమైనా తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సిందే. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, సర్వేయర్‌ తదితర అధికారుల వద్ద పని కోసం వచ్చే వారి వద్దకు ఓ వీఆర్వో టక్కున వచ్చేస్తాడు. వారికి చేసి పెట్టాల్సిన పనిస్థాయిని బట్టి ‘లెక్క’ కడతాడు. తాను నిర్ణయించినంత ఇస్తే ఓకే.. లేకుంటే ఆ పని గురించి పట్టించుకోడు. అవినీతికి అలవాటుపడిన అధికారులు వీఆర్వో ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.

ముడుపులు ఇచ్చిన వారికి నిమిషాల్లో పనులు చేసిపెట్టడం.. ఇచ్చుకోలేని వారికి నెలల తరబడి తిప్పుకుని వేధించడం వీఆర్వో నైజం. ఈ క్రమంలోనే అధికారులందరినీ ఆయన తన అధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు వెళ్లే ఉన్నతాధికారుల వెంట ఈ అధికారి నీడలా ఉంటాడు. తనిఖీల అనంతరం సదరు వ్యక్తుల వద్దకు వెళ్లి బేరాలు కుదుర్చుకుంటాడు. తను అడిగినంత ఇస్తే.. దాడులు, తనిఖీల సమాచారం ముందస్తుగా చేరవేరుస్తానని అమ్ముడుపోతాడు. లెక్కలేనన్ని ప్రభుత్వ నివేసన స్థలాలను తన చేతుల్లో ఉంచుకుని, అవసరానికి అనుగుణంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఈ వీఆర్వో ప్రత్యేకత. లంచం ఎందుకు ఇవ్వాలని ఎవరైనా నిలదీస్తే ‘నీ దిక్కున్నచోట చెప్పుకో’ అంటూ వారినే గదమాయించిన సంఘటనలు ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తూ పాతుకుపోయిన అతడిపై ఫిర్యాదులు వచ్చినా ఏ అధికారీ చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆన్‌లైన్‌లో ఒకరి పేరున ఉన్న భూములను మరొకరి పేరున మార్చి సొమ్ము చేసుకుంటుంటే, మరొక వ్యక్తి ఇంటి పట్టాల్లో పేర్లు మార్చి జేబులు నింపుకుంటున్నాడు. ఈ ఇద్దరూ వీఆర్వో కనుసన్నల్లోనే నడుస్తుండటం గమనార్హం.

కొసమెరుపు
వీఆర్వో అడిగినంత లంచం ఇచ్చి పని చేయించుకున్న ఓ వ్యక్తి.. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌ మొదలుకుని, జాయింట్‌ కలెక్టర్, డీఆర్వో, ఆర్డీఓ ఇలా అందరికీ వీడియో సీడీలతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి మూడు నెలలు గడిచినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.

Advertisement
Advertisement