గుట్టుగా గుట్కా దందా? | Sakshi
Sakshi News home page

గుట్టుగా గుట్కా దందా?

Published Fri, Jun 24 2016 9:32 AM

gutka  business in aob

‘పెదబాబు’ కనుసన్నల్లోనే అంతా?
అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు
 
ఇచ్ఛాపురం(కంచిలి): ఆంధ్రా-ఒడిషా సరిహద్దు ప్రాంతంలో నిషేధిత గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల గొడౌన్లను అద్దెకు తీసుకొని గుట్కాను తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీలతో జిల్లావ్యాప్తంగా రవాణా చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు.

ఇక్కడ తయారైన సరుకే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలస, నరసన్నపేట, పలాస పట్టణాల్లో స్వాధీనం చేసుకున్న సరుకుకు ఇక్కడి వ్యాపారానికి సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇచ్ఛాపురం సరిహద్దులో గొడౌన్లను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 
గురువారం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి అస్సాం బెంగాల్ రోడ్ ట్రాన్స్‌పోర్టు గొడౌన్‌లో గుట్కా తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒడిషా భూభాగమైన సుమాడి జంక్షన్ సమీపంలో గొడౌన్‌లో సైతం  *70లక్షల విలువైన గుట్కా, ముడిసరుకు నిల్వలను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ రెండు స్థావరాలు ‘పెదబాబు’కు  చెందినవిగా  చర్చ సాగుతోంది. ఈయన ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉంటూ వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఒడిషా పోలీసులు సరిహద్దు ప్రాంతంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీపై దాడిచేసి సరకు, తయారీ యంత్రాలను సీజ్‌చేశారు. అప్పట్లో ఒడిషా పోలీసులు స్థానిక పోలీసుల సాయంతోనే ఆ దాడులు చేశారు. తాజాగా జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డికి ఆదేశాల మేరకు స్థానిక పోలీసు యంత్రాంగం దాడి చేయడం గమనార్హం.

Advertisement
Advertisement