కేవీ లో టీచర్ల వికృత చేష్టలు! | Sakshi
Sakshi News home page

కేవీ లో టీచర్ల వికృత చేష్టలు!

Published Thu, Mar 3 2016 9:53 AM

కేవీ లో టీచర్ల వికృత చేష్టలు! - Sakshi

 బాలికల పట్ల అసభ్య ప్రవర్తన
 ఫిర్యాదులు రాలేదన్న ప్రిన్సిపాల్
 
కర్నూలు: ఆదర్శంగా ఉంటూ విద్యార్థులను తమ కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు దారి తప్పుతున్నారు. వికృత చేష్టలతో సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు  కేంద్రీయ విద్యాలయ(కేవీ) టీచర్లు. ఐదారేళ్ల క్రితం బాలికలను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఈ విద్యాలయంకు చెందిన పలువురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన విషయం విదితమే. మరోసారి అక్కడి  ఉపాధ్యాయులు అసభ్య ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు.  క్రమశిక్షణ పేరుతో బాలికలపై వికృత చేష్టలకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాలికల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయపడుతున్నారు.
 
 8, 9 తరగతుల బోధన ఉపాధ్యాయులపైనే ఆరోపణలు
కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టులో కేంద్రీయ విద్యాలయం ఉంది. ఇక్కడ ఒక్కటి నుంచి 12 వ తరగతి వరకు బాలబాలికలకు విద్యా బోధన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ, సీబీఎస్‌ఈ విధానం అమల్లో ఉండడంతో కార్పొరేట్ స్థాయి కంటే మెరుగైన బోధన లభిస్తుంది. దీంతో తల్లిదండ్రులు తమ  పిల్లలను ఇక్కడ చదివించడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల చేష్టలతో పాఠశాలకు చెడ్డ పేరు వస్తోంది. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన బాలికలపై కొందరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 8,9 తరగతులు చదివే విద్యార్థినులపై ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతున్నారు. కొందరు   తల్లిదండ్రులకు చెప్పగా వారు ఫిర్యాదు చేసేందుకు స్కూల్‌కు వస్తే ముఖ్యాధికారులు స్పందించిన తీరు బాధాకరంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 నాకెవరూ ఫిర్యాదు చేయలేదు
 బాలికలపై ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవరిస్తున్నారని నాకెవరూ ఫిర్యాదు చేయలేదు. గతంలో ఉండేవి. వారందరినీ సస్పెండ్ చేసి బదిలీ చేశాం. ఇప్పుడు ఉన్నాయంటే నేను నమ్మలేకున్నా. ఇప్పటికైనా బాలికల తల్లిదండ్రులు  ఫిర్యాదు చేస్తే విచారణ చేయిస్తా.
 - అనురాధ, ప్రిన్సిపాల్
 
 

Advertisement
Advertisement