ఉద్యమంలా హరితహారం | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా హరితహారం

Published Tue, Aug 16 2016 9:54 PM

దుబ్బాక బైపాస్‌ రోడ్డులో నాటిన మొక్కలు

  • ఇప్పటికే నాటిన రెండు లక్షల మొక్కలు
  • మరిన్ని నాటేందుకు సిద్ధంగా
  • నాటిన మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటు
  • రక్షణకు ప్రత్యేకంగా పంచాయతీ సిబ్బంది నియామకం
  • దుబ్బాక రూరల్‌: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం దుబ్బాక నగర పంచాయతీలో పరుగులు తీస్తోంది. దుబ్బాకతోపాటు దుంపలపల్లి, ధర్మాజీపేట, చేర్వాపూర్‌, చెల్లాపూర్, మల్లాయిపల్లి, లచ్చపేట వార్డుల్లో ఉద్యమంలా మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు.

    విరివిగా మొక్కలు నాటడంతో పర్యావరణ కాలుష్యాన్ని కాపాడడమే కాకుండా, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, మొక్కలు నాటడం వల్ల అవి పెరిగి చెట్లుగా మారి అవి మనల్ని రక్షిస్తాయనే అవగాహనతో ఇక్కడి ప్రజలు హరితహారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

    నగర పరిధిలో ఇప్పటివరకు సమారు రెండు లక్షల వరకు మొక్కలు నాటారు. మరి కొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు. నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచె వేశారు. మొక్కల సంరక్షణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పరిధిలోని రేకులకుంట శ్రీమల్లికార్జున దేవస్థానం సమీపంలో ఉన్న సర్వే నంబర్‌ 117, 129లోని భూమిలో 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటారు.

    ఇందుకోసం భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నాటిన ప్రతి మొక్కను భూ యజమానులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 84 ఎకరాల భూమిలో నీలగిరి 80 వేల మొక్కలు, అల్ల నేరెడు పది వేలు, సీతాఫలం ఐదు వేలు, చింత ఐదు వేల మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ భూ యాజమానులు శ్రద్ధతో పెంచుతున్నారు. వీటితో కలిపి ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటారు.

    ప్రతి మొక్కనూ కాపాడుతాం
    నాటిన ప్రతి మొక్కనూ కాపాడుతాం. ఇందుకోసం సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. మొక్కలకు రక్షణగా ట్రీ గార్డు, ముళ్ల కంచెలు వేస్తున్నాం. ఇప్పటివరకు నగర పంచాయతీ పరిధిలో సుమారు రెండు లక్షల మొక్కలు నాటాం. ఇంకొన్ని మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాం. 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భూ యజమానులకు కృతజ్ఞతలు. - భోగేశ్వర్‌, దుబ్బాక నగర పంచాయతీ కమిషనర్‌

    వాడవాడలా మొక్కలే..
    నగర పంచాయతీ పరిధిలో ఎక్కడ చూసినా నాటిన మొక్కలే కన్పిస్తున్నాయి. కార్యాలయాలు, పాఠశాలలు, పొలాలు, ఎక్కడ చూసినా మొక్కలతో నిండిపోయాయి. నాటిని కాపాడేందుకు నగర పంచాయతీ వారు ట్రీ గార్డు, చుట్టూ ముళ్ల కంచె వేశారు. ప్రతి మొక్కను నగర పంచాయతీ సిబ్బంది శ్రద్ధతో పెంచుతున్నారు. - దత్తం స్వామి, స్థానికుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement