Sakshi News home page

కరువుతో కకావికలం

Published Wed, Apr 27 2016 4:32 AM

కరువుతో కకావికలం - Sakshi

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : కరువుతో రాష్ట్రమంతా కకావికలమవుతుంటే ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ ఆకర్ష్‌పై దృష్టి పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కరువుతో జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఎం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే సంఖ్య పెంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంలో లేదని ఎద్దేవా చేశారు.

కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గత రెండు సీజన్లలో నూ తీవ్ర పంటనష్టం సంభవించిందని, బాధిత రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని కొందరు నీటివ్యాపారం చేస్తున్నారన్నారు. వారి ఆటలు కట్టించి ప్రజలకు తాగునీటిని అందించాలన్నారు. పశువులకు గ్రాసం అందించలేక వాటిని తక్కువ ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రంలో సమస్యలు తాండవిస్తుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ధర్నా అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, తూర్పు డివిజన్ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement