గిరిపై ఉక్కిరిబిక్కిరి

25 Apr, 2017 00:14 IST|Sakshi
 • అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఆలయ ప్రాంగణం 
 • సత్తెన్న భక్తులకు ఎండదెబ్బ
 • అరకొర ఏర్పాట్లతో ఇబ్బందిపడుతున్న భక్తులు
 • ప్రహసనంగా మజ్జిగ పంపిణీ పనిచేయని వాటర్‌ కూలర్లు
 • అన్నవరం :
  రత్నగిరి సత్యదేవుని సన్నిధికి విచ్చేసే భక్తులు ఎండలకు అల్లాడిపోతున్నారు. వివాహాల సీజ¯¯ŒS, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. రత్నగిరిపై 40 డిగ్రీలకు పైబడి కాస్తున్న ఎండలకు భక్తులు తట్టుకోలేక పోతున్నారు. దేవస్థానంలో కొన్ని చోట్ల చలువ పందిళ్లు వేశారు. వ్రతమండపాల వద్ద మాత్రం వేయలేదు. అక్కడక్కడా షామియానాలు వేసేందుకు ఇనుప గొట్టాలు పాతి వదిలేశారు. దీంతో మధ్యాహ్నమైతే చాలు భక్తులు ఆలయప్రాంగణంలో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ‘‘తెల్లపెయింట్‌ వేశాం. దానిపై భక్తులు నడిస్తే కాళ్లు కాలవు’’ అని అధికారులు చెబుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు. రావిచెట్టు నీడలోనే సేదతీరుతున్నారు.
  ప్రహసనంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం
  రత్నగిరిపై భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ ప్రహసనంగా మారింది. మజ్జిగ పంపిణీకి ఎంచుకున్న స్థలం, సమయం పరిశీలిస్తే అధికారుల చిత్తశుద్ధి బయటపడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచి ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే రోజుకు కేవలం 50 లీటర్లు పాలు మాత్రమే ఇందుకు కేటాయించారు. దీంతో వచ్చే మజ్జిగ మాత్రమే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. రోజూ పదివేలకు పైగా భక్తులు రత్నగిరికి వస్తుంటే , కనీసం వేయి మందికి కూడా ఈ మజ్జిగ సరిపోవడం లేదు. 
  మొక్కుబడిగా నిర్వహణ..
  సత్యదేవుని నిత్యాన్నదాన పథకం నుంచే ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. నిత్యాన్నదానపథకానికి భక్తులు నిత్యం వేలాది రూపాయలు విరాళాలుగా సమర్పిస్తున్నా.. అధికారులు మజ్జిగ పంపిణీని మొక్కుబడిగా నిర్వహించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఈ మజ్జిగ పంపిణీని రోశయ్య మండపానికి ఎదురుగా నిర్వహించారు. ఈ సారి సర్కులర్‌ మండపంలో చివరన నిర్వహిస్తున్నారు. 
  అలంకారప్రాయంగా కూలింగ్‌ వాటర్‌ పాయింట్‌
  దేవస్థానంలో చాలా చోట్ల ఏర్పాటు చేసిన కూలింగ్‌ వాటర్‌ పాయింట్లు పనిచేయడం లేదు. అయినా అధికారులు వాటికి మరమ్మతులు చేయించడం లేదు. దేవస్థానం ఈఓ కార్యాలయం వెలుపల గల కూలింగ్‌వాటర్‌ పాయింట్‌ పనిచేయకుండా పోయి సుమారు ఆరునెలలైనా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భక్తులు చల్లని నీటి కోసం ప్రైవేటు షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. 
   
మరిన్ని వార్తలు