సమైక్య మేటి.. ఉద్యమ కోటి! | Sakshi
Sakshi News home page

సమైక్య మేటి.. ఉద్యమ కోటి!

Published Sun, Aug 9 2015 1:49 PM

సమైక్య మేటి.. ఉద్యమ కోటి! - Sakshi

♦ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం
♦ ప్రత్యేక హోదాకు పోరాటం
♦ కలకలం రేపిన ‘కోటి’ ఆత్మబలిదానం

 
ముని కామకోటికి.. ఉద్యమాలే ఊపిరి. సమైక్యాంధ్రే ఆయన కల. కానీ ఆయన కలలు కల్లలయ్యాయి. రాష్ట్రం ముక్కలైపోయింది. ముఖంలో చిరునవ్వు చెదిరిపోయింది. ఒంటరి జీవితం అలవాటైంది.  ప్రత్యేక హోదా కోసం పరితపిస్తున్న నేతలను చూసి నవ్వుకునేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలో నిర్వహించిన కాంగ్రెస్ పోరు సభకు వెళ్లాడు. నాయకుల ప్రసంగాలు వింటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘తెలుగు జాతి విడిపోయింది, సమైక్య ఉద్యమం చేసినా ఫలితం లేకపోయింది.. తెలుగు జాతి వర్ధిల్లాలి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి..’ అంటూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 
                  .
తిరుపతి సిటీ : నగరంలోని మంచాలవీధికి చెందిన కోటి(మునికామకోటి) ఉద్యమ నేత. ఉమ్మడి రాష్ట్రం కోసం ఆరాటపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తనదైన శైలిలో ఆందోళనలు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నగర నేతగా, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీ సభ్యునిగా పనిచేశారు. మబ్బు చెంగారెడ్డికి విధేయుడిగా ఉండేవారు. రాష్ర్టం విడిపోయినప్పటి నుంచి స్నేహితులతో, స్థానికులతో కలివిడిగా ఉండడం మానుకున్నాడు. ఎప్పుడూ ముభావంగా ఉండేవాడు.

 పెళ్లైనా.. ఒంటరిగానే..
వడమాలపేటకు చెందిన యువతిని 12 సంవత్సరాల కిందట బీఎంకె.కోటి వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల పాటు వారి కాపురం సజావుగా సాగింది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడిపోయారు. కోటి తండ్రి మునిరామయ్య, తల్లి ఇటీవల మృతిచెందారు. అప్పట్నుంచి మంచాల వీధిలో నివాసముంటున్న కోటి తన తమ్ముడు లగేజీ ఆటో డ్రైవర్ మురళి ఇంట్లోనే ఉంటున్నాడు.

ఇటీవల ఆరు నెలల కిందట తమ్ముడి ఇంట్లో ఉండడం ఇష్టంలేక అదే వీధిలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. మూడు నెలలుగా సోదరుడు మురళికి సహాయకుడిగా ఆటో నడిపేందుకు వెళుతుండేవాడు. శనివారం కాంగ్రెస్ పోరు సభకు వెళ్లాడు. సభ మధ్యలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రత్యేక హోదా సాధించాలి.. అంటూ నిప్పంటించుకున్నాడు.

 రాష్ట్రం విడిపోకూడదనే..
 ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం విడిపోకూడదని  చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాల్లో  మబ్బు చెంగారెడ్డితో పాటే కోటి చురుగ్గా  పాల్గొనేవాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడిగా  పనిచేసినట్లు స్నేహితులు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోకూడదని నిరాహార దీక్ష చేశాడు. మంచాల వీధిలోని స్థానికులకు ఏ సమస్య వచ్చినా స్పందిచేవాడు. ఆ వీధిలోని వారందరితో కలసిపోయి తలలో నాలుకలా ఉండేవాడు.

రెండు మూడు రోజులుగా బంధువులు, స్నేహితులతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. రాష్ట్రం విడిపోయినా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా దక్కలేదని కుమిలిపోయేవాడు. ప్రత్యేక హోదా విషయమై స్థానికులతో ఎప్పుడూ చర్చిస్తుండేవాడు.

కాపాడబోయి..
కోటితోపాటు మంచాల వీధికే చెందిన శేషాద్రి శనివారం కాంగ్రెస్ పోరు సభకు వెళ్లారు. తన వీధికి చెందిన కోటి మంటల్లో కాలిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే కోటిని పట్టుకుని మంటలు ఆర్పబోయి గాయపడ్డాడు.

కన్నీళ్లు..ఆర్తనాదాలు
కోటి ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన వెంటనే సోదరుడు మురళి, అతని భార్య  కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement