కన్నీరే మిగిలింది! | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది!

Published Fri, Nov 13 2015 2:01 AM

కన్నీరే మిగిలింది! - Sakshi

♦ వర్షాల ధాటికి భారీగా దెబ్బతిన్న పంటలు
♦ రైతన్నలకు రూ.వందల కోట్ల నష్టం
 
 సాక్షి నెట్‌వర్క్:  రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది. రహదారులు దెబ్బతినడంతో రోడ్లు, భవనాల శాఖ రూ.కోట్లలో నష్టపోయింది. వైఎస్సార్ జిల్లాలో పంటలు, రోడ్డు దెబ్బతినడంలో రూ.20 కోట్లకుపైగా నష్టం సంభవించినట్లు అంచనా.

 కుండపోత వర్షాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు, వరదలో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. 500 గొర్రెలు, మేకలు నీటిలో గల్లంతయ్యాయి. వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవతో క్షేమంగా బయటపడ్డారు. చిట్వేలు-రాపూరు మధ్యలో బుధవారం రాజుబండి చెరువుకు గండిపడటంతో ట్రాన్స్‌కో సీఈ నంద కుమార్ ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. ఆయనతోపాటు డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వర్షాల ధాటికి వైఎస్సార్ జిల్లాలో ఆరుతడి, ఉద్యాన పంటలకు రూ.10 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.10 కోట్ల నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ దెబ్బతింది.

 చిత్తూరు జిల్లాలో ఏడుగురు బలి: చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ధాటికి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ఏడుగురు మరణించారు.

 పంట నష్టం వివరాలు సేకరించండి :సీఎం
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై త్వరగా నివేదికలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టం, ఉపశమన చర్యలపై ఆరా తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement