ఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు | Sakshi
Sakshi News home page

ఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు

Published Fri, Aug 5 2016 10:31 PM

మాగనూరు: కృష్ణ ఘాట్‌ వద్ద నీటి ప్రవాహంలో కృష్ణవేణి విగ్రహం

పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద 
– కొన్ని ఘాట్ల వద్ద ఉధృతంగా కృష్ణా ప్రవాహం
 – పుష్కరపనులకు అంతరాయం 
– సోమశిల వీఐపీ ఘాట్‌కు చేరువలో నదీ ప్రవాహం
పుష్కరఘాట్లలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడటంతో ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతోంది. జూరాల నుంచి శ్రీశైలం డ్యాంకు నీటిని విడుదల చేస్తుండటంతో.. నిన్నటి వరకు రాళ్లు రప్పలతో నిండిన పుష్కరఘాట్లు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నారు. జూరాల బ్యాక్‌వాటర్‌లో ఉన్న పలు పుష్కరఘాట్లు నీటిలో పూర్తిగా ముగినిపోయాయి. మరికొన్న చోట్ల పుష్కరపనులు చేసేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
– కొల్లాపూర్‌/ఆత్మకూరు/గద్వాల/మక్తల్‌/పెబ్బేరు/మాగనూరు
 
  •  మక్తల్‌ మండలంలో ఘాట్ల వద్దకు భారీగా నీళ్లు వచ్చాయి. పసుపుల పుష్కరఘాట్‌ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఘాట్‌ మెట్లు కొంతవరకే తేలాయి. పారేవులలో కూడా నీళ్లు భారీగా వచ్చాయి. పంచదేవ్‌పాడు ఘాట్లలోకి నీళ్లు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడుతోంది. ముస్లాయిపల్లి, గడ్డంపల్లి, అనుగొండ ఘాట్లు ఇదివరకే పూర్తిగా మునిగిపోయాయి. 
  •  ఆత్మకూర్‌ మండల పరిధిలోని నందిమల్లడ్యాం, జూరాల, మూలమల్ల,ఆరేపల్లి, కత్తేపల్లి ఘాట్లలోకి భారీగా నీళ్లు వచ్చాయి. భక్తులు పుష్కరస్నానం చేసేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 
  •  ఎట్టకేలకు కొల్లాపూర్‌ మండలం సోమశిల వీఐపీ ఘాట్‌లోకి కృష్ణానది నీరు చేరుతోంది. మరో మూడు రోజుల పాటు వరద నీరు ఇలాగే ప్రవహిస్తే జనరల్‌ఘాట్‌ వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. మల్లేశ్వరం, మంచాలకట్ట, అమరగిరి, చెల్లెపాడ పుష్కరఘాట్లకు చేరువగా కృష్ణానది నీటిమట్టం ఉంది. నది నీళ్లు పెరగడంతో సోమశిల వద్దకు పర్యాటక శాఖ లాంచీని తీసుకొచ్చారు.
  •  మాగనూరు మండలంలోని కృష్ణా ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. గంటగంటలకు నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో పలు పుష్కరఘాట్లు పూర్తిగా నీట ముగిగాయి. కృష్ణ వద్ద ఏర్పాటు చేసిన‡ఘాట్‌ వద్ద దాదాపు 50మెట్ల వరకు నీరు చేరింది. 
  •  గద్వాలలో నదీ అగ్రహారం ఘాట్లలో 8.91మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. మూడు వరసలు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. మరో రెండు వరుసలు తేలి ఉన్నాయి. నెట్టెంపాడు, ఉప్పేరు, రేవులపల్లి, చింతరేవుల ఘాట్లు 90శాతం మేర మునిగిపోయాయి. రేకులపల్లి, తెలుగోనిపల్లి, బీరెల్లిలో మూడు వరుసలు నదీ ప్రవాహంలో మునిగిపోయాయి. 
  •  పెబ్బేరు మండలం రంగాపూర్‌ ఘాట్‌ వద్ద భారీ వరద ప్రవాహం ఉంది. ఏడు లైన్లతో ఘాట్‌ను నిర్మిస్తుండగా, నాలుగు ఘాట్లు పూర్తిగా నీటిలో ముగినిపోయాయి. వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఘాట్‌ వద్ద పనులు ఆశించినస్థాయిలో సాగడం లేదు. రాంపూర్, మునగమాన్‌ దిన్నె ఘాట్ల వద్ద కృష్ణా ప్రవాహం బాగా ఉంది.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement