యుద్ధ సైనికులకు ఆర్థిక సాయం | Sakshi
Sakshi News home page

యుద్ధ సైనికులకు ఆర్థిక సాయం

Published Sat, Aug 6 2016 11:24 PM

విధి నిర్వహణలో నిమగ్నమైన సైనికులు

♦ రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు
♦ జిల్లాలో 35 మందికి లబ్ధి
 
శ్రీకాకుళం న్యూకాలనీ: యుద్ధవీరుల సేవలను ప్రభుత్వం గుర్తించింది. 1939 నుంచి 1945 సంవత్సరాల మధ్య రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పనిచేసిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచింది. కొన్నేళ్లుగా నెలకు రూ.3000 ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జూలై 20 నుంచి పెంచిన సాయం అమల్లోకి వస్తుందని ‘ఉత్తర్వుల సంఖ్య 88 హోమ్‌ (సర్వీసెస్‌–4) డిపార్ట్‌మెంట్‌’లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయానికి ఉత్తర్వుల చేరాయి. జిల్లాలో 35 కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. యుద్ధంలో పాల్గొన్న ఒకేఒక్క మాజీ సైనికుడు బతికుండగా, మిగిలిన 34 మంది వితంతువులే కావడం గమనార్హం. మాజీ సైనికులు, వితంతువుల ఆధార్‌ కార్డు నంబర్, ప్రస్తుతం సహాయం అందుతున్న బ్యాంకు ఖాతా నంబర్‌ను అనుసంధానం చేసి జిరాక్సు కాపీలను జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయానికి అందజేయాలని సంక్షేమాధికారి సత్యానందం కోరారు. మరిన్ని వివరాలకు 08942–227688 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. 
 
చేయూత ఇలా మొదలైంది..
 
పింఛన్‌కు కూడా నోచుకోని యుద్ధసైనికుల కుటుంబాలను రాష్ట్రసర్కారు తొలుత 1985లో గుర్తించింది. వీరికి అప్పటి రాష్ట్ర  ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  హయాంలో (1985)లో 500 అందజేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో (2002లో) దీనిని రూ.1000కి పెంచారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి (2005లో) రూ.3000లకు పెంచారు. తాజాగా దానిని రూ.5 వేలకు పెంచారు. 
 
ఆర్థిక చేయూత పెంచాలి 
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి సైనికులు పోరాడారు. సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ప్రభుత్వాలు పెద్దమనసుతో ఆలోచించాలి. దశాబ్దం తర్వాత గాని పెంపునకు నోచుకోకపోవడం బాధాకరం. కనీసం రూ.10 వేలకు తగ్గకుండా ఆర్థిక చేయూతను అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి.
  – డి.సింహాచలం, జిల్లా మాజీ సైనిక,కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు 
 
 

Advertisement
Advertisement