కంట తడి పెట్టిన హీరో రామ్ | Sakshi
Sakshi News home page

కంట తడి పెట్టిన హీరో రామ్

Published Sat, Aug 13 2016 10:11 AM

కంట తడి పెట్టిన హీరో రామ్ - Sakshi

హీరో రామ్‌తోమాటామంతీ
 
విశాఖపట్నం: బతుకు పోరాటం చేస్తున్న ఓ చిన్నారి కల ఫలించింది. తన అభిమాన నటుడితో ముచ్చటించి, ఆనందడోలికల్లోతేలియాడింది. ఎంవీపీకాలనీ సెక్టార్ 3 నివాసితుల సంక్షేమ సంఘం (యువజన విభాగం) అధ్యక్షుడు రవికుమార్ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక (5) దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. పుట్టిననాటి నుంచి చిన్నారి నడుము కింద భాగం చ చ్చుబడిపోయింది.
 
బుడిబుడి అడుడులతో ఇంట్లో తల్లిదండ్రుల చెంత ఆటలాడుకోవల్సిన చిన్నారి.. అడుగు కూడ కదపలేని పరిస్థితి. తల్లిదండ్రులు ఈ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే చిన్నారికి మాత్రం వర్థమాన కథానాయకుడు రామ్ అంటే చాలా ఇష్టం. గతంలో నగరానికి వచ్చిన రామ్‌ను చూసే అవకాశం చిన్నారికి వచ్చింది. అప్పటి నుంచి రామ్‌ను పదేపదే చూడాలన్న తపన చిన్నారిలో బలంగా నాటుకుపోయింది.
 
ఓ సినిమా షూటింగ్ కోసం రామ్ విశాఖ రావడంతో కుందన కోరిక తీరింది. శుక్రవారం సాయంత్రం తన కలల కథానాయకుడు చిన్నారిని కలిసేందుకు వచ్చాడు. ఎంవీపీకాలనీలో వారి ఇంటికి వెళ్లి  కొద్దిసేపు ముచ్చటించాడు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. కుందన దుస్థితి చూసి రామ్ చలించిపోయాడు. చిన్నారిని పట్టుకుని కంటతడిపెట్టాడు. కొద్దిసేపటికి తనను తాను వారించుకుని శనివారం మధ్యాహ్నం తనతో భోజనం చేయడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. హీరో రామ్‌ను చూసిన ఆనందం చిన్నారి కళ్లలో స్పష్టంగా కనిపించింది.

Advertisement
Advertisement