హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు

Published Fri, Oct 21 2016 1:49 AM

హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు - Sakshi

  •  స్టేటస్‌కోను ధిక్కరించి ఆక్రమణ తొలగింపు
  • ఖండించిన ప్రసన్న  
  • నార్తురాజుపాళెం (కొడవలూరు): హై కోర్డు స్టేటస్‌కో ఉత్తర్వులున్నా ధిక్కరించి ఆక్రమణ తొలగించిన సంఘటన నార్తురాజుపాళెంలో గురువారం చోటు చేసుకుంది. అయితే వైఎస్సార్‌ సీపీకి చెందిన వారివి మాత్రమే తొలగించడం అధికారుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. నార్తురాజుపాళెం ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను బుధవారం నుంచి తొలగిస్తుండటం విదితమే. అయితే గురువారం నాటి తొలగింపులో అధికారులు హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేశారు. ఆక్రమణదారుల్లో కె.శ్రీనివాసులు, మల్లికార్జున, వెంకటలక్ష్మి హైకోర్టు నుంచి స్టేటస్‌కో ఉత్తర్వులు (యథా స్థితిని కొనసాగించడం) తెచ్చుకున్నారు. ఉత్తర్వులు గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, నాయకుడు ఫజురుల్లా స్థానిక తహసీల్దార్‌ రామకృష్ణకు అందజేశారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఆక్రమణలను కూల్చేశారు. 
    హై డ్రామా :
    ఉత్తర్వులను ఆర్‌అండ్‌బీ అధికారులకు అందజేయాల్సి ఉండగా, సర్వేయర్‌ పత్తాలేకుండా పోయారు. స్టేటస్‌కో ఉత్తర్వులు తనకందలేదంటూ ఆర్‌అండ్‌బీ జేఈ కృష్ణ ఆక్రమణను కూల్చివేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే హైడ్రామా నడిచిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
    కోర్టు ధిక్కారమే :
     హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధికారులు హైడ్రామా నడిపి కూల్చడం కోర్టు ధిక్కారమేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం కూల్చివేతను స్వయంగా పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ జేఈ, సర్వేయర్లను పిలిచి మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చెబితే ఏమైనా చేస్తారా? కోర్టును కూడా ధిక్కరిస్తారా అంటూ వారిపై మండి పడ్డారు. కోర్టు ధిక్కారణ కేసు పెడితే అధికారులే సమాధానం చెప్పుకోవాలని హెచ్చరించారు. అధికార ప్రతినిధి చలపతిరావు మాట్లాడుతూ అధికారుల వైఖరిపై కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. 
     
     

Advertisement
Advertisement