ఈసారీ అంతేనా? | Sakshi
Sakshi News home page

ఈసారీ అంతేనా?

Published Tue, Aug 16 2016 12:13 AM

hnss scheme not formed in anantapur this year

అనంతపురం సెంట్రల్‌ : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా  మూడేళ్లుగా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయి. మూడేళ్ల క్రితమే మొదటిదశ పనులు దాదాపు పూర్తయ్యాయి.  ప్రధాన కాలువ పూర్తయిన వెంటనే డిస్ట్రిబ్యూటరీ పనులు మొదలు పెట్టకుండా పాలకులు ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఆయకట్టుకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి అధికారుల్లో ఏమాత్రమూ కనిపించడం లేదు. వాస్తవానికి మొదటిదశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది.

కర్నూలు జిల్లాలో 80 వేలు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 35వ ప్యాకేజీలో 216 కిలో మీటర్‌ వద్ద జీడిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. మన జిల్లాలో మొదటి దశలో 30 నుంచి 36 వరకు ప్యాకేజీలు ఉన్నాయి. 33వ ప్యాకేజీ పరిధిలో 20,900 ఎకరాలు, 34వ ప్యాకేజీలో 17,300 ఎకరాలు, 36వ ప్యాకేజీలో 80,600 ఎకరాల ఆయకట్టు ఉంది.  ఆ భూములకు నీళ్లు విడుదల చేయాలంటే ముందుగా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాలి. సప్లయ్‌ ఛానళ్లు, ఇతర కాలువలు అభివృద్ధి చేయాలి. అయితే.. ఇంత వరకూ ప్రధాన కాలువపైనే దృష్టి సారించిన అధికారులు ఆయకట్టు అభివృద్ధికి జోలికి వెళ్లలేదు.

కక్ష సాధింపు!
ఉరవకొండ నియోజవర్గ ప్రజలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఆయకట్టుకు నీరివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి మొదటి దశలో దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయి. 10శాతం పనులు పూర్తి చేయకుండా లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములను ప్రభుత్వ బీడు పెడుతోంది.  కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు రావడంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది.  జలాశయంలో 136 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో కూడా భారీగా ఉంది. ఈ నేపథ్యంలో హంద్రీ–నీవా ద్వారా వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడానికి కృషి చేయాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నుంచి  తాగునీటి అవసరాల కోసం ఐదు టీఎంసీలు హంద్రీ–నీవాకు కేటాయించారు. ఈ నీటిని రెండు,మూడు పంపుల ద్వారా  తీసుకుంటున్నారు.  

చర్యలు తీసుకుంటాం : జలంధర్, సీఈ, హంద్రీనీవా
తాగునీటి కోసం హంద్రీనీవాకు ఐదు టీఎంసీలు విడుదల చేశారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఐదు వేల ఎకరాలకు నీరిచ్చేందుకు పనులు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో కొంత ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తున్నాం.

Advertisement
Advertisement