శ్రీమఠంలో ముగిసిన హోమాలు

17 May, 2017 21:33 IST|Sakshi
శ్రీమఠంలో ముగిసిన హోమాలు
 లోకకల్యాణార్థం మూడురోజులుగా నిర్వహణ
 
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో లోక కల్యాణార్థం చేపట్టిన హోమాలు బుధవారంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేత​ృత్వంలో మూడురోజులుగా శాంతి, వాస్తు హోమాలు నిర్వహించారు. శ్రీమఠం యాగశాలలో పండితుల వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా, భక్తుల హర్షధ్వానాల మధ్య శాస్త్రోక్తంగా పురోహితులు క్రతువులు కానిచ్చారు. హోమాల సమర్పణోత్సవంలో భాగంగా పూర్ణాహుతి కనుల పండువగా చేశారు. ముందుగా పీఠాధిపతి పూర్ణకుంభాలతో రాఘవేంద్రుల బృందావనంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా మంచాలమ్మ ఆలయం చేరుకుని పట్టువస్త్ర, ఆభరణాల సమర్పణ పూజలు చేశారు. యాగ శాలను చేరుకుని పూర్ణహుతి పలికారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశంతో హోమాలు చేపట్టినట్లు పీఠాధిపతి వివరించారు. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు