ఆలయాలపై ఆశలు | Sakshi
Sakshi News home page

ఆలయాలపై ఆశలు

Published Wed, Aug 31 2016 12:01 AM

ఆలయాలపై ఆశలు - Sakshi

  • 29 దేవాలయాలకు పాలక మండళ్లు
  • నోటిఫికేషన్‌ జారీచేసిన దేవాదాయ శాఖ
  • దరఖాస్తులకు 20 రోజులు గడువు
  • పదవుల కోసం నేతల ప్రయత్నాలు
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆలయాల ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం వెంట వెంటనే నోటిఫికేషన్‌లు జారీ చేస్తోంది. రాష్ట్రస్థాయి ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి, మేడారంలోని సమ్మక్క–సారలమ్మ జాతర, కురవిలోని వీరభద్రస్వామి, వరంగలోని భద్రకాళి, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి, వర్ధన్నపేట మండలం ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయాలకు ధర్మకర్తల కమిటీ నియామకం కోసం దేవాదాయ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇవే కాకుండా జిల్లాలోని వివిధ కేటగిరీలకు చెందిన 29 ఆలయాలకు ధర్మకర్తల మండళ్ల నియామకం కోసం మంగళవారం(30న) మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది.
     
    ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమితులు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్‌ జారీ చేసిన 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. వరుస నోటిఫికేషన్లతో అధికార పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా నియమితులై, చైర్మన్‌ పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. దేవాలయాల ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులు చేసింది. గతంలో రెండేళ్లు ఉన్న పదవీకాలాన్ని ఏడాదిగా నిర్ణయించింది. అన్ని కేటగిరీ ఆలయాల ధర్మకర్తల కమిటీల్లోని సభ్యుల సంఖ్యను పెంచింది. వార్షిక ఆదాయం ప్రామాణికంగా దేవాలయాలను నాలుగు కేటగిరీలుగా దేవాదాయ శాఖ పరిగణిస్తుంది.
     
    రూ.2 లక్షలలోపు ఆదాయం, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఆదాయం, రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలలోపు ఆదాయం, కోటి రూపాయలకుపైగా ఆదాయం కేటగిరీలుగా ఆలయాలు ఉంటాయి. కోటి రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు 14 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమిస్తారు. రూ.25 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం ఉన్న ఆలయాలకు ఏడుగురు, రెండు లక్షల రూపాయల నుంచి రూ.25 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఉంటుంది. 
     
    మంగళవారం వచ్చిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆలయాలు నియోజకవర్గాల వారీగా...
     
    ములుగు : శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామప్ప), శ్రీముసలమ్మ జాతర(గుంజేడు)
     
    వరంగల్‌ తూర్పు : కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం(స్టేషన్‌రోడ్‌), శ్రీనాగేశ్వరస్వామి దేవస్థానం(ఉర్సు), శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం(రామన్నపేట), శ్రీదుర్గేశ్వరస్వామి దేవాలయం(గిర్మాజీపేట), శ్రీభోగేశ్వరస్వామి దేవాలయం(మట్టెవాడ)
    వరంగల్‌  పశ్చిమ : శ్రీరుద్రేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ), శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(హన్మకొండ)
    స్టేషన్‌ఘన్‌పూర్‌ : శ్రీబుగులు వెంకటేశ్వస్వామి దేవాలయం(చిల్పూరు), శ్రీరామచంద్రస్వామి దేవస్థానం(జీడికల్‌), గట్టు మల్లికార్జునస్వామి దేవాలయం(మల్లికుదుర్ల), శ్రీకోదండరామస్వామి దేవాలయం(నవాబుపేట)
    డోర్నకల్‌ : శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(మరిపెడ), శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం(నర్సింహులపేట).
    పరకాల : శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొమ్మాల), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(మల్లక్కపేట), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(అగ్రంపహాడ్‌), శ్రీకట్టమల్లన్నస్వామి దేవాలయం(గొర్రెకుంట), శ్రీకుంకుమేశ్వరస్వామి దేవాలయం(పరకాల)
    మహబూబాబాద్‌ :  శ్రీచంద్రమౌలేశ్వరస్వామి దేవాలయం(మహబూబాబాద్‌), శ్రీరామ మందిరం(మహబూబాబాద్‌)
    భూపాలపల్లి : శ్రీబుగులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం(తిరుమలగిరి), శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(కొడవటంచ), శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(మొగుళ్లపల్లి), శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయం(భూపాలపల్లి)
    జనగామ : శ్రీసిద్ధేశ్వరస్వామి దేవాలయం(కొడవటూరు)
    వర్ధన్నపేట : శ్రీసమ్మక్క–సారలమ్మ జాతర(దామెరగుట్ట)
     
     
     

Advertisement
Advertisement